అస్థిర జీవనశైలి, బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు కారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య అసిడిటీ, హైపర్ అసిడిటీ. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శాశ్వత ఒత్తిడి కారణంగా కూడా జరుగుతుందని చెబుతున్నారు. అనేక ఇతర ఆరోగ్య సమస్యలకి దారి తీయవచ్చు. పొట్టలో పుండ్లు, యాసిడ్ రీఫ్లక్స్ ని హైపర్ అసిడిటీ అని పిలుస్తారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మద్యపానం, అధిక ధూమపానం, ఇతర జీవనశైలి అలవాట్లు కారణం పొట్ట లైనింగ్ దెబ్బతిని వాపు సంభవిస్తుంది. ఇది తీవ్రమైన కడుపులో మంటని కలిగిస్తుంది. ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆయుర్వేదం ఆమోదించిన మూడు సహజ పదార్థాలతో తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పొట్టలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి.


ధన్యక్ హిమ


ఆయుర్వేదం ప్రకారం ధన్యక్ అంటే కొత్తిమీర గింజలు లేదా ధనియాలు. ఇవి పిత్త దోషాన్ని తగ్గిస్తాయి. ఆమ్లత్వాన్ని అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియని మెరుగుపర్చడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ విత్తనాలు తీసుకుంటే ఆపానవాయువు, ఉబ్బరం సమస్యని తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకుని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని తెల్లారి వడకట్టి ఖాళీ కడుపుతో తాగేయాలి. ఇది అసిడిటీ సమస్య మాత్రమే కాదు బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది. కొవ్వుని కరిగించేస్తుంది.


ఫెన్నెల్ సీడ్స్, రాక్ షుగర్


నిపుణుల అభిప్రాయం ప్రకారం సొంపు గింజలు నమలడం ఆరోగ్యకరమైన అలవాటు. ఇందులో యాంటీ అల్సర్ లక్షణాలు కడుపులోని పొరని చల్లబరుస్తాయి. జీర్ణవ్యవస్థకి ఉపశమనం కలిగిస్తాయి. సొంపు గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ హైపర్ అసిడిటీని నియంత్రించడంలో సహాయపడతాయి. ½ టీ స్పూన్ సోంపు గింజలు, రాక్ షుగర్ తీసుకుని బాగా కలుపుకోవాలి. వాటిని భోజనం చేసిన తర్వాత రోజుకి రెండు సార్లు తింటే మంచిది. ఆహారం అరుగుదలకి సోంపు గింజలు చక్కగా ఉపయోగపడతాయి. సొంపు గింజలు అసిడిటీకి మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. వీటితో చేసిన నీటిని తాగడం వల్ల కళ్ళకు చాలా మేలు జరుగుతుంది.  


నల్ల కిస్మిస్


బ్లాక్ రైసిన్ వీటిని మునక్క అని కూడా పిలుస్తారు. వీటిలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఆమ్లత్వం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఖాళీ పొట్టతో ధనియాల నీరు తాగిన తర్వాత 10 నల్ల ఎండు ద్రాక్ష తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఫినాలిక్ సమ్మేళనాల గొప్ప మూలం. యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కార్డియోవాస్కులర్ వ్యాధుల్ని తగ్గిస్తుంది. కొవ్వులు లేవు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ లతో నిండి ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు