Foods to Eat and Avoid for Better Blood Sugar : చలికాలం వచ్చిందంటే వేడి వేడి టీ, కాఫీలు, పకోడీలు, స్వీట్లు తినాలనిపిస్తుంది. చలికి వ్యాయామం చేయాలనే ఆసక్తి కూడా తగ్గుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఈ సమయంలో ఆహారం, రోజువారీ అలవాట్ల విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లు మారడం, అనారోగ్యాలు రావడం వంటి కారణాలు కొందరిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మరి ఈ సీజన్లో షుగర్ అదుపులో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దేనికి దూరంగా ఉండాలో చూసేద్దాం.
డయాబెటిస్ ఉన్నవారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
చలిగా ఉందని చాలామంది ఉదయం నడక, వ్యాయామం మానేస్తారు. దీనివల్ల శరీరం వినియోగించే శక్తి తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆకలి, ఆహారపు అలవాట్లు మారతాయి. వేడి వేడి పదార్థాలు, పిండి వంటలు, స్వీట్లు ఎక్కువగా తినాలనిపించవచ్చు. వీటిని ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవచ్చు. దాహం కూడా తక్కువగా అనిపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ పెంచి.. షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపిస్తుంది.
Also Read : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
డయాబెటిస్ ఉన్నవారు చలికాలంలో ఏమి తినాలి?
మీక మధుమేహం ఉంటే వింటర్లో కొన్ని రకాల ఫుడ్స్ కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి. పాలకూర, మెంతికూర, తోటకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే.. శరీరానికి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు భోజనం తర్వాత రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. ఏవి తిన్నా లిమిటెడ్‌గా తినడమే ఆరోగ్యానికి మంచిది.
అలాగే పెసరపప్పు, కందిపప్పు, శనగలు, రాజ్మా వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ అందిస్తాయి. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను కూడా తగిన పరిమాణంలో తీసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. హెల్తీ ఫ్యాట్స్ కోసం బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ తీసుకోవచ్చు. జామ, యాపిల్, నారింజ, బొప్పాయి వంటి పండ్లను కూడా మితంగా తీసుకోవచ్చు. పెరుగు లేదా మజ్జిగను కూడా డైట్లో ఉండేలా చూసుకోండి.
Also Read : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
డయాబెటిస్ ఉన్నవారు చలికాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్
చలికాలంలో వచ్చే క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్, హల్వా వంటి స్వీట్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో వీటిని తరచూ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవచ్చు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.
సమోసాలు, పకోడీలు, మిర్చి బజ్జీలు, చిప్స్ వంటి పదార్థాల్లో నూనె, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. బరువు పెరగడం ఇన్సులిన్ నిరోధకతను మరింత పెంచవచ్చు. వీటికి బదులుగా ఉడికించిన శనగలు, మొలకలు లేదా తక్కువ నూనెతో చేసిన స్నాక్స్ తీసుకోవచ్చు. కూల్‌డ్రింక్స్ మాత్రమే కాదు.. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు, చక్కెర కలిపిన టీ, కాఫీ, హాట్ చాక్లెట్ వంటి పానీయాల్లోనూ చక్కెర ఎక్కువగా ఉండవచ్చు. వీటికి బదులుగా చక్కెర లేనివి తాగండి.
Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో
చలికాలంలో డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలిగా ఉందని ఉదయం నడకను పూర్తిగా మానేయకండి. వాతావరణం అనుకూలంగా లేకపోతే ఇంట్లోనే నడవండి. భోజనం టైమ్‌కి తినాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండి ఒకేసారి ఎక్కువగా తినకండి. వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి. రెగ్యూలర్‌గా రక్తంలో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. జ్వరం, జలుబు లేదా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుతడు షుగర్ స్థాయిలు మారవచ్చు. అలాంటి సమయంలో వైద్యుడి సలహా తీసుకోండి.
Also Read : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
