ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుని మూడేళ్లు దాటింది. 2020లో ఈ సమయానికి కరోనా కేసులు తీవ్ర స్థాయిలో బయటపడ్డాయి. మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. కరోనా కోరల నుంచి కాస్త బయటపడుతున్నాం అనుకునేలోపే, కరోనా పుట్టినిల్లు చైనాలో మరో వైరస్ పురుడు పోసుకుంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల చైనాలో 35 మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఆ వైరస్ పేరు ‘జూనోటిక్ లాంగ్యా వైరస్’. దీన్నే ‘లాంగ్యా హెనిపా వైరస్’ అని పిలుస్తారు. షార్ట్‌కట్‌లో ‘లేవి’ అంటారు. ఈ వైరస్ మనుషులకే కాదు జంతువుల్లోనూ పాకుతుంది. తీవ్రంగా అనారోగ్యం పాలయ్యేటట్టు చేస్తుంది. దీనికి ఇప్పటివరకు ఎలాంటి మందులు కనుగొనలేదు. వ్యాక్సిన్లు లేవు.
అంటువ్యాధా?
తూర్పు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో లాంగ్యా వైరస్ బారిన పడిన రోగులకు కనుగొన్నారు. ఆ రోగులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా వైరస్ సోకిందని అనుమానంతో పరీక్షలు చేయగా కొత్త వైరస్ జాతి బయటపడింది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని గుర్తించారు. అయితే మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందో లేదో ఇంకా తేల్చలేదు. మేకలు, కుక్కల్లో మాత్రం ఈ వ్యాధి వ్యాపిస్తోంది. వాటి నుంచి మనుషులకు సులువుగా వ్యాప్తిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకుతుందని మాత్రం ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అది అంటువ్యాధా కాదా? ఒకవేళ అంటువ్యాధి అయితే ఏ స్థాయిలో వ్యాపిస్తుంది అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి?
లాంగ్యా వైరస్ సోకిన వారిలో తీవ్ర జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు వంటివి కలుగుతాయి. ఇవన్నీ కూడా కరోనా వైరస్ లక్షణాలు కూడా కావడంతో చాలా మంది అదేనేమో అని అనుమానిస్తారు.
చైనా బయట?
ప్రస్తుతానికి లాంగ్యా వైరస్ కేసులు చైనాలోనే బయటపడ్డాయి. ఇంకా ఆ దేశం దాటి బయటికి రాలేదు. బయటి దేశాల్లోని ప్రజలకు కూడా సోకడం మొదలుపెడితే మళ్లీ ఈ వైరస్‌ను ‘ప్రపంచ అత్యవసర ఆరోగ్య పరిస్థితి’ ప్రకటించాల్సి రావచ్చు. ఇప్పటికే మంకీపాక్స్ 80 దేశాలకు పైగా పాకి అత్యవసర పరిస్థితిని ప్రకటించేలా చేసింది. కరోనా తరువాత మంకీపాక్స్, మంకీపాక్స్ తరువాత రెచ్చిపోయే వైరస్ లాంగ్యానేనా? అనే అనుమానం కూడా మొదలైంది.
ఈ వైరస్ పరిక్షించేందుకు కూడా సరైన పద్ధతులు ప్రస్తుతానికి లేవు. తైవాన్లోని ల్యాబ్‌లు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఒక ప్రామాణిక పద్ధతిని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అది విజయవంతమైతే ఈ వైరస్ సోకిందో లేదో కొన్ని నిమిషాల్లో కనిపెట్టవచ్చు. ఈ వైరస్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. కొన్ని సందర్భాల్లో కరోనాలాగే ఇది ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాలేయం, కిడ్నీ ఫెయిల్యూర్‌లు రావచ్చు.
Also read: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే
Also read: ప్రపంచాన్ని ఏలుతున్న అయిదు భాషలు ఇవే, ఒక్కో భాషని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.