ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఒక్కసారి వచ్చిందా జీవితాంతం కొనసాగే ఓ రుగ్మత. ఏటా పది లక్షల మంది కేవలం డయాబెటిస్ వల్లే మరణిస్తున్నారు. ఈ రోగాన్ని నియంత్రణలో ఉంచకపోతే అంధత్వం, మూత్రపిండాలు విఫలమవడం, ఇన్ ఫెక్షన్ సోకి పాదాలు,  కాళ్లు తొలగించడం, గుండె పోటు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్ ను ఎవరూ అంత తక్కువ అంచనా వేయకూడదు. 


వారసత్వంగా వస్తుందా?
మధుమేహం వారసత్వంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు పెద్ద వయసులో రావచ్చు. అలాగే వారసత్వం కాకపోయినా ఊబకాయం, అధికబరువు ఉన్న వారిలో కూడా మధుమేహం కలగవచ్చు. గర్భిణిలుగా ఉన్నప్పుడు కూడా జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. ప్రసవం అయ్యాక కొందరిలో ఈ డయాబెటిస్ పోతుంది. కానీ కొందరిలో మాత్రం కొనసాగుతుంది. మరికొందరిలో ప్రసవం అయ్యాక పూర్తిగా తగ్గిపోయి, నాలుగైదేళ్ల తరువాత తిరిగి టైప్ 2 డయాబెటిస్ గా మారి బయటపడుతుంది. 


గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే?
ఆహారం తిన్నాక అందులో ఉండే పిండిపదార్థాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలే ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో చెప్పేదే గ్లైసెమిక్ ఇండెక్స్. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినమని డయాబెటిక్ రోగులకు చెబుతారు వైద్యులు. 


ఏ అన్నం తినాలి?
అన్నం తినడం చక్కెర అధికంగా ఒంట్లో చేరుతుంది. అందుకే ఒక పూట అన్నం తిని రెండో పూట చపాతీలతో సరిపెట్టుకుంటారు. అయితే వైట్ రైస్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్ లలో ఏ బియ్యం వాడడం వారికి మంచిదో అన్న సందేహం చాలా మందిలో ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే తెల్లబియ్యం, బ్రౌన్‌ రైస్‌తో పోలిస్తే బాస్మతి బ్రౌన్‌ బియ్యం మధుమేహులుకు మంచిది. బాస్మతి రైస్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. కాబట్టి రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగని మూడు పూటలా దీన్ని తిన్నా సమస్య పెరుగుతుంది. ఈ బియ్యంతో చేసిన వంటకాలను మితంగా తింటూనే ఆరోగ్యాన్నిచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ప్రొటీన్‌ అధికంగా ఉండే పప్పుధాన్యాలను తినాలి. పిండిపదార్థాలు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read also: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Read also: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Read also: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Read also: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Read also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి