‘‘ఈ రోజు చందానగర్‌లో ఓ రోడ్డు  ప్రమాదం జరిగింది. వ్యాన్ ఢీకొనడంతో 50 ఏళ్ల మహిళ రోడ్డుపై పడి స్పృహ కోల్పోయింది. ఆమె ఎంతకీ కళ్లు తెరవడం లేదు. ఆ ప్రమాదం జరిగి దాదాపు 5 నిమిషాలవుతున్నా ఎవరూ 108కు కాల్ చేయలేదు. ఎవరో ఒకరు చేస్తారని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కానీ, ఎవరూ ఫోన్ చేయలేదు. అప్పుడే అటుగా వెళ్తున్న ‘ఏబీపీ దేశం’ ప్రతినిధి ఆ ఘటన చూసి.. 108కు కాల్ చేశాడు. కానీ, అప్పటికే అంబులెన్సులు బిజీగా ఉన్నాయి. చాలా సేపటివరకు అంబులెన్స్ రాలేదు. ఆలస్యమైతే ఆమె ప్రాణాలు పోతాయని భావించి ఆ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరే స్వయంగా ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 108 అంబులెన్సు వెంటనే ఎందుకు రాలేదనేది వేరే విషయం. కానీ, ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు 108కు ఎందుకు కాల్ చేయడం లేదు? ఎందుకలా చూస్తుండి పోతున్నారు? ఎవరికీ బాధ్యత లేదా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో మెదులుతాయి. అంతెందుకు.. మీరే ఆ ప్లేస్‌లో ఉంటే 108కు కాల్ చేస్తారా? 


బాధ్యత ఉంది కానీ, భయం: ప్రాణం పోతుంటే చూస్తుండిపోవాలని ఎవరికీ ఉండదు. తప్పకుండా ఎవరికో ఒకరికి జాలి కలుగుతుంది. కానీ, 108కు కాల్ చేస్తే.. తమ పనులు మానుకుని అక్కడే ఉండాల్సి వస్తుందనో లేదా పోలీసులు తమని కూడా విచారిస్తారనో ఆలోచిస్తుంటారు. ఆ రిస్క్ మనకెందుకనే ఉద్దేశంతో చాలామంది ముందుకురారు. పైగా, ఎవరో ఒకరు అంబులెన్సుకు ఫోన్ చేసే ఉంటారులే, మనమెందుకు ఇందులో చిక్కుకోవడం అని అనుకుంటారు. అయితే, మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీ కళ్ల ముందే ప్రాణం పోతుంటే అలా చూస్తుండిపోవడం చాలా దుర్మర్గం. వీలైతే వెంటనే 108కు కాల్ చేసి ఫోన్ చేయండి. ఎందుకంటే ప్రమాదంలో చిక్కుకున్నవారికి తప్పకుండా ప్రథమ చికిత్స అవసరం. దీనిపై చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి, కనీసం అంబులెన్సుకు వీలైనంత త్వరగా కాల్ చేస్తే.. అవి వెంటనే వచ్చి బాధితులను రక్షించే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన ప్రతి నిమిషం కీలకమే. 


రూల్స్ ఏం చెబుతున్నాయ్?: ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మీరు 108కు కాల్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉండదు. మీరు కేవలం వారికి ప్రమాదం జరిగిన ప్రాంతం, ల్యాండ్ మార్క్ చెబితే చాలు. అది ఘోర ప్రమాదమైతే పోలీసులకు కూడా కాల్ చేయాలి. అప్పుడు వెంటనే ఎమర్జెన్సీ సేవలు అప్రమత్తమై త్వరగా స్పందిస్తారు. కేవలం ఫేక్ కాల్స్, ప్రాంక్ కాల్స్ చేస్తేనే ఇబ్బంది. 108కు కాల్ చేయడమంటే మీరు ఒకరి ప్రాణం కాపాడేందుకు సాయం చేస్తున్నట్లే. ఒక వేళ మీరు కాల్ చేసిన సమయానికి 108 అంబులెన్స్ రావడం ఆలస్యమైతే.. క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్‌కు కూడా తరలించవచ్చు. మీ దగ్గర అంత సమయం లేకపోయినా, క్షతగాత్రుల వెంట సహచరులు ఎవరూ లేకపోయినా 100కు కాల్ చేసి పోలీసుల సహాయం తీసుకోవచ్చు. బాధితులను పోలీసులకు అప్పగించి మీరు వెళ్లిపోవచ్చు. కానీ, కొన్ని ప్రాంతాల్లో 108కు కాల్ చేసిన వెంటనే పోలీసులకు కూడా సమాచారం వెళ్తుంది. కొన్ని సెంటర్స్‌లో మాత్రం పోలీసులకు మనమే కాల్ చేయాల్సి వస్తుంది. 


108కు ఎప్పుడు కాల్ చేయాలి?: తీవ్రమైన గాయాలు, గుండె నొప్పి, స్ట్రోక్, తీవ్రమైన శ్వాసకోస సమస్యలు, డయబెటిస్ ఎమర్జెన్సీ, పురిటి నొప్పులు, మూర్ఛ, స్పృహ కోల్పోవడం, జంతువుల దాడిలో గాయపడటం, తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్స్‌తో తీవ్రమైన లేదా అత్యవసర సమస్యలు వచ్చినప్పుడు 108 అంబులెన్స్ సేవలను అందుకోవచ్చు. 108కు కాల్ చేసి సమస్యను వివరంగా చెప్పాలి. దాన్ని బట్టి అంబులెన్సులో ఉండే వైద్య సిబ్బంది ప్రథమ చికిత్సకు సిద్ధమవుతారు.


ఈ రోజు ఎవరో.. రేపు మీరే కావచ్చు: ప్రమాదం జరిగిన వెంటనే ‘‘అయ్యోపాపం’’ అని జాలి చూపి వెళ్లిపోవద్దు. ఎవరైనా 108కు కాల్ చేశారా? అని అడగండి. ఎవరూ కాల్ చేయకపోతే మీరే ఆ బాధ్యత తీసుకోండి. ఎందుకంటే.. ఆ బాధితులకు కూడా ఆప్తులు, కుటుంబం ఉంటుంది. ఈ రోజు ఎవరికో ఆ సమస్య రావచ్చు. ఎవరూ 108 కాల్ చేయకుండా వెనకడుగు వేస్తే ప్రాణాలు పోవచ్చు. అది మీ వరకు రాకూడదంటే తప్పకుండా దీనిపై అవగాహన, చైతన్య అవసరం. కాబట్టి, మీరు 108కు కాల్ చేయడానికి వెనకడుగు వేయొద్దు. తోటివారిని కాపాడేందుకు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వివరాలు షేర్ చేసుకుని ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించండి. 


ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలి?


ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్లో ఈ సమస్యలు రావచ్చు: 
⦿ అస్ఫిక్సియా (ఆక్సిజన్ కోల్పోవడం)
⦿ గుండెపోటు
⦿ తీవ్రమైన రక్తస్రావం 
⦿ గాయాలు 


ఆ నాలుగు నిమిషాలు కీలకం: ప్రమాదానికి గురైన వెంటనే చాలామంది స్పృహ కోల్పోతారు. అయితే, వారిని చనిపోయినట్లు భావించకూడదు. ప్రమాదం వెంటనే మొదటి నాలుగు నిమిషాలు చాలా కీలకం. ప్రమాదం వల్ల ఆక్సిజన్ బ్లాక్ అయ్యే అవకాశాలుంటాయి. దాని వల్ల వారు స్పృహ కోల్పోతారు. కాబట్టి, వారి ఆక్సిజన్‌ను పునరుద్ధరించడం చాలా ముఖ్యం. 


వెంటనే ఇలా చేయండి:


⦿ ప్రమాద ప్రాంతం నుంచి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించండి. 
⦿ వెంటనే 108 అంబులెన్స్, 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. 
⦿ శ్వాస అందించడం కోసం నోటిలో నోరు పెట్టి గాలి ఊదండి. 
⦿ గుండె ఆగినట్లు అనుమానం వస్తే.. సీపీఆర్ చేయండి (తీవ్రమైన గాయలుంటే జాగ్రత్త)
⦿ రక్త స్రావాన్ని కూడా ఆపండి. 
⦿ గాయపడినవారిని చాలా సున్నితంగా, నెమ్మదిగా నేలపై పడుకోబెట్టాలి. 
⦿ వారు కంగారు పడకుండా చేయాలి. ఏమీ జరగలేదు, అంతా బాగుందని చెప్పాలి. 
⦿ వీలైతే బాధితుడు/బాధితురాలిని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టండి. 
⦿ మెడ, ఛాతి వద్దు దుస్తులు బిగువుగా లేకుండా చేయండి. దుస్తులు వదులు చేయండి. 
⦿ మీరున్న ప్రాంతానికి అంబులెన్సులు రావడం ఆలస్యమైతే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించండి. 
⦿ శ్వాస ఆడకపోతున్నట్లు గుర్తిస్తే.. బాధితుడి ముక్కు మూసి ఛాతి పైకి లేచేంతగా నోటిలోకి గాలి ఊదండి. 
⦿ ఛాతి పైకి లేవనట్లయితే..  పెద్దలకు ప్రతి నాలుగు సెకన్లకు, పిల్లలకు ప్రతి మూడు సెకన్లకు గాలి ఊదండి.
⦿ శరీరానికి ఏమైనా గుచ్చుకుంటే వెంటనే బయటకు లాగొద్దు. దానివల్ల రక్తస్రావం పెరిగిపోతుంది. 
⦿ గాయం నుంచి రక్తం రాకుండా క్లాత్ చుట్టి కట్టు వేయండి.
⦿ అంబులెన్సు వచ్చేలోపే మీరు ఇవన్నీ చేయాలి. 


Also Read: హ్యాట్సాఫ్ హర్ష సాయి, ఫైస్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు


Also Read: ‘హర్ ఘర్ తిరంగా’లో మీ పేరును ఇలా నమోదు చేస్కోండి, ఈ సర్టిఫికెట్ పొందండి