చట్నీ దగ్గర నుంచి పప్పు వరకు పచ్చి మిర్చి లేనిదే రుచి రాదు. పచ్చి మిరపకాయలు భారతీయుల వంటకాల్లో ఉపయోగించే సాధారణ పదార్థం. కాస్త కారంగా ఉన్నప్పటికీ మిర్చీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరల్లో కాస్త పచ్చి మిర్చి ఎక్కువ అయ్యిందంటే చాలు ఆ మంట గూబకి అంటడం ఖాయం. అందుకే మితంగా వేసుకుంటారు. దీని ఘాటు, రంగు, రుచి కోసం ప్రతి వంటలో ఉపయోగిస్తారు. మిరపకాయల్లో విటమిన్ ఏ, బి6, కెతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, థయామిన్, ఐరన్, కాపర్ వంటి మినరల్స్ ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మిరపకాయలు తినడం మంచిది. తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
పచ్చి మిర్చి జాతికి చెందినవే బెల్ పెప్పర్స్ కూడా. వీటినే క్యాప్సికమ్ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తాయి. నారింజ కంటే ఎక్కువగా బెల్ పెప్పర్స్ లో విటమిన్-సి పొందవచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. బరువు తగ్గించే దగ్గర నుంచి కొవ్వు కరిగించే వరకు ఎన్నో విధాలుగా శరీరానికి సహాయం చేస్తుంది పచ్చిమిర్చి
కొవ్వు కరిగిస్తుంది
మిరపకాయలలోని ప్రధాన బయోయాక్టివ్ సమ్మేళనం క్యాప్సైసిన్ ఉంటుంది. ఘాటైన రుచి ఇవ్వడంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఏజెంట్ గా పని చేస్తుంది. క్యాప్సైసిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, ఊబకాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గించే లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది
ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరోటినాయిడ్లు, ఆస్కార్బిక్ యాసిడ్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలకు పచ్చి మిరపకాయలు మంచి మూలం. ఈ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టాటిక్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌తో పాటు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది
మిరపకాయలోని ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్, కెరోటినాయిడ్ వల్ల వస్తుంది. కెరోటినాయిడ్లు కాంతి, ఆక్సిజన్ నుండి శరీర కణజాలాలకు రక్షణను అందిస్తాయి. మిరపకాయలు తినడం వల్ల గుండె జబ్బుల మరణాల రేటు తగ్గుతుంది. హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 మధుమేహం నియంత్రణకి ఇది అద్భుతమైనది. గుండె జబ్బులు తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది.
వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది
పచ్చి మిరపకాయలు ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) ప్రధాన వనరులలో ఒకటి. ఆస్కార్బిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్స్ తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మం లోపల నుంచి కాంతిని ఇచ్చేందుకు సహాయపడుతుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గించేలా చేస్తుంది.
రోగనిరోధక శక్తి ఇస్తుంది
రోగనిరోధక శక్తి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. క్యాప్సైసిన్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఆహారంలో వ్యాధికారక సూక్ష్మజీవుల ఉనికిని నిరోధిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.