Konaseema News : డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తల్లీకూతురు హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ముమ్మిడివరం మండలంలోని సీహెచ్ గున్నేపల్లికి చెందిన తనను, తన తల్లి వేండ్రపు వెంకటలక్ష్మిని హత్య చేయించేందుకు సమీప బంధువు వేండ్రపు శ్రీనివాస ప్రసాద్ ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని అన్యం నాగపుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై శనివారం రాత్రి ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదులో వివరాల ప్రకారం.. శ్రీనివాస ప్రసాద్ తల్లీకూతురును హత్య చేయించడానికి దార్ల ఏసురాజు అనే వ్యక్తితో రూ.2 లక్షలు సుపారీ మాట్లాడుకున్నాడు. డబ్బు తీసుకున్న వ్యక్తి భయపడి విషయాన్ని బాధితులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఏసురాజు, శ్రీనివాసప్రసాద్ లపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.  


భూ సరిహద్దుల వివాదం 


భూ సరిహద్దు తగాదాల కారణంగా వేండ్రపు వెంకటలక్ష్మి కుమారుడు రామకృష్ణకు, శ్రీనివాస్ ప్రసాద్ కు గొడవలయ్యాయి. అప్పుడు రామకృష్ణ కనిపించడం లేదని అతని తల్లి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా అతని ఆచూకీ కనుగొనలేదని నాగపుష్ప హైకోర్టులో హేబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులివ్వడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేయడంతో 2019 డిసెంబరు 8న రామకృష్ణ హత్యకు గురైనట్లు ఆరు నెలల తర్వాత బయట పడింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి శ్రీనివాస ప్రసాద్ కాగా మరో ఇద్దరిపైనా అప్పట్లో కేసు నమోదైంది. గతంలో కొడుకు, ప్రస్తుతం తల్లీకూతురిని హతమార్చేందుకు సుపారీ మాట్లాడినట్లు బాధితులు చెబుతుండడంతో కోనసీమలో చర్చనీయాంశంగా మారింది. 


అసలేం జరిగింది? 


ఇద్దరు మహిళల హత్యకు పథకం పన్నిన నిందితుడిపై కేసు నమోదు అయింది. తన తమ్ముడు రామకృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు వేండ్రపు శ్రీనివాస ప్రసాద్ ఇప్పుడు తమను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తమ్ముడు హత్యకు గురికావడంతో అనారోగ్యంతో ఉన్న తల్లిని అక్కా ,చెల్లెళ్లు చూసుకుంటున్నారు. చెల్లెలు, పిన్నిని హతమార్చేందుకు శ్రీనివాస ప్రసాద్ రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న వ్యక్తి దార్ల ఏసురాజు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఏసురాజు, వేండ్రపు శ్రీనివాస ప్రసాద్ ను అదుపులోకి తీసుకొన్నారు. 2019 డిసెంబరు 8న హనీట్రాప్ ద్వారా హత్యకు గురి అయిన వేండ్రపు రామకృష్ణ హత్యకేసులో శ్రీనివాస ప్రసాద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రామకృష్ణ  కనిపించకుండా పోయిన ఆరు నెలల వరకూ దర్యాప్తు మందకొడిగా సాగింది. మృతుడు రామకృష్ణ సోదరి హైకోర్టులో హేబీఎస్ కార్పస్ దాఖలు చేయడంతో  దర్యాప్తు వేగవంతం చేసి రామకృష్ణ హత్యకు గురి అయినట్లు ప్రధాన నిందితుడు అతని సోదరుడు వేండ్రపు శ్రీనివాస ప్రసాద్ గా గుర్తించారు పోలీసులు. ఇప్పుడు పాత కక్షల కారణంగా శ్రీనివాస ప్రసాద్ తన పిన్ని, చెల్లెలును హత్యచేసేందుకు దార్ల ఏసురాజుతో రెండు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. భయంతో మృతుడి సోదరికి ఏసురాజు ఫోన్ చేసి చెప్పాడు. స్థానికులు ఏసురాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస ప్రసాద్, ఏసు రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ అన్న శ్రీనివాస ప్రసాద్ నుంచి తమకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు మహిళలు.