నలో చాలా మంది రోజులో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. కొందరైతే రాత్రిపూట కూడా రెండు మూడు సార్లు మూత్ర విసర్జన కోసం నిద్రమేల్కొంటూ ఉంటారు. అయితే ఇది సాధారణమే అని నిపుణులు అంటున్నరు. మరి రోజుకు పది సార్లకంటే ఎక్కువ గా మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తే మాత్రం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో టాక్సిన్స్ ను బయటకు విసర్జించే ప్రక్రియల్లో మూత్ర విసర్జన ఒకటి. శరీరధర్మాలలో ఇది కూడా ముఖ్యమైనది. పది సార్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తోందంటే మాత్రం కచ్చితంగా ఏదో తేడా చేసిందని గుర్తించాలి. చాలా రకాల కారణాలతో ఇలా అతిగా మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది.




  • యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్




బాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించినపుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావచ్చు.  యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సోకినపుడు తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలని అనిపించవచ్చు. అంతేకాదు మూత్ర విసర్జన నొప్పి లేదా మంటతో ఉంటుంది. ఈ సమస్యకు నీళ్ళు ఎక్కువగా తాగడం, నొప్పి తగ్గేందుకు మందులు వాడడం ద్వారా దీన్ని తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో యాంటీ బయాటిక్స్ అవసరం కూడా ఏర్పడవచ్చు. కనుక తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు చికిత్స తీసుకోకపోతే అది కిడ్నీ ఇన్ఫెక్షన్ కు, సెప్సిస్ కు కూడా దారి తియ్యవచ్చు.




  • డయాబెటిస్




రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే రక్త శుద్ధికి కిడ్నీలు మరింత శ్రమించాల్సి వస్తుంది. అందువల్ల తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్లు, చక్కెరలు వినియోగించే వారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మాత్రం టైప్ 2 డయాబెటిస్ కావచ్చని అనుమానించాల్సి వస్తుంది.


డయాబెటిస్ సమస్యలో మూత్రం ఒకరకమైన తీపి వాసన కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా మంది ఈ సమస్యను గుర్తించడంలో జాప్యం చేస్తుంటారు. ఎందుకంటే ఈ సమస్యలో చాలా చిన్న చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. వీటిని విస్మరిస్తుంటారు. తప్పకుండా డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడాలి. జీవన శైలిలో మార్పుల కూడా డయాబెటిస్ లో తప్పనిసరి. దీనికి చికిత్స అందించకపోతే గుండె, కిడ్నీ వంటి ముఖ్యమైన అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినవచ్చు. కొన్ని సార్లు ప్రాణాపాయానికి కారణం కూడా కావచ్చు.




  • స్ట్రోక్




మెదడులో మూత్రాశయాన్ని నియంత్రించే నాడులు స్ట్రోక్ వల్ల ప్రభావితం అయినపుడు తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు. ఒక్కోసారి మూత్ర నియంత్రణా సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు . స్ట్రోక్ కు వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం అవసరం. కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది.




  • లైంగిక సంక్రమణలు




క్లామిడాయా, గోవెరియా అత్యంత సాధారణంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు. మూత్ర విసర్జన సమయంలో మూత్రం తెల్లగా, చిక్కగా కనిపించినా లేదా చాలా ఘాటైన దుర్వాసన వేస్తున్నా అది లైంగిక సంక్రమణగా అనుమానించాలి. దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. లేదా నాడీ సంబంధ సమస్యలు, వంధ్యత్వం, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం, పుట్టుకతో లోపాలు కలిగిన బిడ్డలు పుట్టడం లేదా స్టీల్ బర్త్ వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురుకావచ్చు.


Also read: మీకు తెలుసా? ఆరోగ్యకరమైన ఈ అలవాట్లు అనారోగ్య కారకాలని?




  • మూత్రాశయ క్యాన్సర్




మూత్రాశయంలో కణితి ఏర్పడినపుడు అది మూత్ర విసర్జన ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు. మూత్ర విసర్జనలో నొప్పి కూడా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భంలో వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించి చికిత్స ప్రారంభించడం అత్యవసరం.




  • ప్రెగ్నెన్సీ




కడుపులో బిడ్డ పెరిగే కొదీ మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది కనుక తరచుగా మూత్రవిసర్జన చెయ్యాల్సి రావచ్చు. హార్మోన్లలో వచ్చే మార్పులు కూడా మూత్ర విసర్జన మీద ప్రభావాన్ని చూపుతాయి. గర్భవతులు తరచుగా డాక్టర్ ను సంప్రదించి సమయానుసారం సలహాలు తీసుకోవడం అవసరం. గర్భధారణ నిర్ధారించుకున్న తర్వాత కనీసం నెలకు ఒక సారి గర్భవతులు డాక్టర్ ను సంప్రదిస్తూ ఉండాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.