ఈ ప్రపంచంలో మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్నే గడుపుతున్నారని అనుకుంటున్నారా? అయితే, మీరు భ్రమలో ఉన్నట్లే. మనకు చాలా మంచి చేసే అలవాట్లు ఉన్నాయని, ఆరోగ్యవంతమైన అలవాట్లతో జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ అలవాట్లే మీ ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్నిచూపుతున్నాయన్నా అవగాహన ఉండదు.
ఎక్కువ రకాల హిస్టామిన్ ఫూడ్ తీసుకోవడం
హిస్టమిన్ అనే మాట యాంటీ హిస్టమిన్ అనే మందుల ద్వారా విని ఉంటాం. చాలా మంది అలర్జీకి విరుగుడుగా ఈ యాంటీ హిస్టమిన్స్ వాడుతుంటారు. శరీరంలో తయారయ్యే హిస్టామిన్ అనే రసాయనం రోగ నిరోధక వ్యవస్థను మాడ్యులేట్ చేసి అలెర్జీలు, ఇన్ఫ్లమేషన్‌ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిస్టామిన్ ఉత్పత్తి, నిల్వలు, విడుదల, వాటి సంశ్లేషణ వంటివన్నీ కూడా శరీరం చాలా సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే శరీరంలో ఇలా నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతే హిస్టామిన్ ఇన్టాలరెన్స్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ హిస్టామిన్ స్థాయిలు పెరిగిపోయి శరీరం అదుపు చేసే పరిస్థితిలో ఉండదు. అందువల్ల విరేచనాలు, కడుపు నొప్పి, స్త్రీలలో నెలసరి నొప్పి, హేఫీవర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబారడం, బీపీ హెచ్చుతగ్గులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిస్టామిన్ శరీరంలోపల తయారైనప్పటికి, మనం తీసుకునే ఆహారం, మందుల్లో కూడా హిస్టామిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రక్తంలోకి మరింత హిస్టామిన్ విడుదల కావచ్చు.
హిస్టామిన్ ఇన్టాలరెన్స్ ఉన్న వారు అధిక మొత్తంలో ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పుకునే అధిక హిస్టామిన్ కలిగిన ఆహారం తీసుకున్నపుడు అలర్జీ అగ్రీవేట్ అవుతుంది. అందువల్ల అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. చేపలు, టమాటలు, బచ్చలి కూర, వంకాయ, అవకాడో, వెనిగర్, ఈస్ట్, సోయాసాస్, ఆల్కాహాల్ వంటి ఏదైనా పులియబెట్టిన ఆహారాలు హిస్టామిన్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు గా చెప్పుకోవాలి.
మీరు హిస్టామిన్ ఇన్టాలరెన్స్ తో బాధ పడుతున్నట్టు అనుమానంగా ఉంటే కొంత కాలం పాటు తక్కువ హిస్టామిన్ కలిగిన పదార్థాలు తీసుకుని చూసి తర్వాత కొంత హిస్టామిన్ ఎక్కువ కలిగిన పదార్థాలు తీసుకోని పరీక్షించుకుంటే అర్థం అవుతుంది.
సప్లిమెంట్ల వాడకం
సప్లిమెంట్లు వాడడం వల్ల పోషకాహారలోపాన్ని సవరించుకోవచ్చు. శరీరం దానికి కావల్సినన్ని పోషకాలను మాత్రమే వినియోగించుకోగలుగుతుంది. కొంత మంది విటమిన్ సి తీసుకుంటే అలర్జీకి గురికావచ్చు. సప్లిమెంట్లు వాడుతున్నపుడు ఏదైనా మందు మీకు సరిపడినట్టు అనిపించకపోయినా లేక తేడాగా అనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
ఎక్కువ కాయగూరల వినియోగం
రోజుకు 30 గ్రాములకు మించి ఫైబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పీచు పదార్థాలు అలర్జీలకు కారణం కావచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అలర్జీలు ఉన్నవారు బ్రకోలి, క్యాబేజి వంటి కూరగాయలు తిన్నపుడు కడుపుబ్బరం, అజీర్తి, విరేచనాలు లేదా మలబద్దకం వంటి సమస్యలతో బాధపడవచ్చు. కూరగాయల్లో ఉండే చక్కెరలు, ఫైబర్ మీకు హిస్టామిక్ అలర్జీ కి కారణం కావచ్చు.
బాటిల్డ్ వాటర్
బాటిల్డ్ వాటర్ ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా శరీరం మీద ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. బాటిల్ లోనింపిన నీళ్లు ప్రతిసారీ స్వచ్ఛమైనవై ఉండకపోవచ్చు. పంపు నీటిని ఇంట్లోనే ఫిల్టర్ చేసుకుని తాగడం మంచిది. బయటకి వెళ్లినపుడు నీళ్లు వెంట తీసుకువెళ్లడం కూడా అలవాటు చేసుకోవాలి.
ఎక్కువగా వ్యాయామం చెయ్యడం, రోజుకు రెండు సార్లకంటే ఎక్కువ బ్రష్ చెయ్యడం, ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవడం, హ్యాండ్ సానిటైజర్ ఎక్కువగా వాడడం వంటివి కూడా అలర్జీలు అగ్రివేట్ కావడానికి కారణం కావచ్చు. ఏదైనా సరే పరిమితుల్లో ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికైనా టైమ్ మార్చుకోండి