శరీర బరువు అనేది తీసుకునే ఆహారం మీదే దాదాపుగా 80 శాతం ఆధారపడి ఉంటుంది. మిగిలిన 20 శాతం వర్కవుట్ ద్వారా కంట్రోల్ లో పెట్టడం సాధ్యపడుతుంది. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, తిన్నదాన్ని ఎలా అరిగించుకుంటున్నాము అనేవి బరువు పెరిగే విషయం మీద ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఏ సమయంలో తింటున్నాము అనేది కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయని నిరూపిస్తున్నారు.
రాత్రి పూట ఆలస్యంగా భోంచెయ్యడం వల్ల బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఇప్పటికి చాలా అధ్యయనాలు రుజువులు చూపాయి. చీకటి పడిన తర్వాత మంచింగ్ చెయ్యడం వల్ల మనం ఎన్ని కెలోరీలు బర్న్ చేస్తున్నాము, ఎంత ఆకలితో ఉన్నాము, మన శరీరం నిల్వ చేసుకునే విధానం వీటన్నిటిని నేరుగా ప్రభావితం చేస్తుందని కొత్త అధ్యయనం కొత్త విషయాలను వెల్లడి చేస్తోంది.
రోజులో చివరి భోజనం ఏ సమయంలో తింటారు అనేదానికి మీరు బరువు పెరగడానికి మధ్య లింక్ ఉందని శాస్త్రవేత్తలు ఇది వరకే రుజువులు చూపారు. ఇప్పుడు ఆ విషయం గురించి అవగాహన కలిగిస్తున్నారు. అధిక బీఎంఐ ఉన్న 16 మందిని ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా చేసి సిక్స్ డే టెస్టులు చేశారు. వారు ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి విషయాల్లో చాలా కఠినంగా నియంత్రించారు.
ఒక గ్రూప్ లో వారికి రోజుకు మూడు సార్లు భోజనం ఇచ్చారు. ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గంటకు భోజనం, సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం ఇచ్చారు. మరో గ్రూప్ లో వారికి మధ్యాహ్నం 1 కి అల్పాహారం, 6 గంటలకు రాత్రి భోజన, 9 గంటలకు మరోసారి భోజనం ఇచ్చారు.
రక్త పరీక్ష ద్వారా కడుపు నిండుగా ఉన్నపుడు శరీరంలో ఉండే హార్మోన్ లెప్టిన్ స్థాయిలను పరీక్షించినపుడు ఇవి రెండో గ్రూప్ వారిలో 24 గంటల పాటు తక్కువే ఉన్నట్టు వచ్చిందట. అంటే వీరు ఎప్పుడూ ఆకలిగా ఉన్నారని అర్థం. ఈ హార్మోన్ తక్కువగా ఉంటే ఎక్కువ తినేసే ఆస్కారం ఉంటుంది. అంతేకాదు క్యాలరీలు కూడా చాలా నెమ్మదిగా ఖర్చవడాన్ని గమనించారట.
సమయం దాటిన తర్వాత తినడం వల్ల అడిపోజెనిసిస్ ద్వారా ఎక్కువ కొవ్వు నిల్వ ఉంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవ్వును విచ్ఛిన్నం చేసే లిపోసిస్ కూడా నెమ్మదించినట్టు గుర్తించారట. కేవలం భోంచేసే సమయాలు మారినందువల్ల కూడా శరీర బరువు పెంచుతాయని బరువు పెరగడం రకరకాల అనారోగ్యాలకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధ్యాహ్నం నాలుగు తర్వాత తినడం వల్ల మన ఆకలి స్థాయిలో గణనీయమైన తేడా గమనించామని తిన్న తర్వాత క్యాలరీలను బర్న్ చేసే విధానం, కొవ్వు నిల్వ చేసే విధానంలో గణనీయమైన తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా తినడం వల్ల శక్తి సమతుల్యత సరిగా లేకపోవడం వల్ల ఊబకాయం ప్రమాదం కూడా పెరిగిపోతుందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read : ఒళ్లు పెరిగితే ఆరోగ్యం గుల్ల - హెల్దీగా కనిపించినా క్యాన్సర్ ముప్పు తప్పదట!