శరీరంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఎక్కువ బరువు కలిగి ఉండడాన్ని స్థూలకాయంగా చెప్పవచ్చు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 25 లేదా అంతకంటే ఎక్కువ గా ఉన్నపుడు వారిని స్థూలకాయులుగా పరిగణిస్తారు. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. శరీరం వినియోగించే క్యాలరీల ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోయి స్థూలకాయంగా మారుతుంది. కొంత మందిలో జన్యుకారణాలు కూడా ఉండొచ్చు. మరి కొందరిలో పెద్దగా కదలికలు లేని జీవన శైలి కూడా కారణం కావచ్చు.
అయితే స్థూలకాయుల్లో క్యాన్సర్ ప్రమాదం కూడా ఎక్కువే అని, వారు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, పరీక్షల్లో అనారోగ్యాలేవీ నిర్థారించకపోయినా వారు ప్రమాదంలో ఉన్నట్టే అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది.
అధిక బరువు కలిగి ఉన్న వారు వారి పరీక్షల్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి అదుపులో ఉన్నట్టు కనిపించినంత మాత్రాన వారు సేఫ్ గా ఉన్నారని అనుకునే వీలు లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనలో చాలా మంది లావుగా ఉన్నంత మాత్రాన అనారోగ్యాలు వచ్చేస్తాయా? మాకెలాంటి జబ్బులు లేవు, స్క్రీనింగ్ పరీక్షల్లోనూ అన్ని రీడింగ్స్ సరిగ్గా ఉన్నాయని వాదిస్తుంటారు. అయితే స్వీడన్ లోని మాల్మోలోని లండ్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపుగా 8 లక్షల మంది డేటాను అధ్యయనం చేసి అధిక బరువు ఉన్నవారు రిస్క్ లో లేకుండా ఉండలేరని చెబుతున్నారు.
మెటబాలిక్ కాంప్లెక్షన్లు ఉన్న స్థూలకాయులు చాలా ప్రమాదంలో ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నారు. మెటబాలిక్ సమస్యలు, స్థూలకాయం మీద దృష్టి నిలిపితే క్యాన్సర్ కేసులను గణనీయంగా నివారించవచ్చని ఈ అధ్యయన రచయిత డాక్టర్ మింగ్ సన్ అన్నారు.
స్థూలకాయంతో ఉండి బెటబాలిక్ సమస్యలు లేని పురుషుల్లో కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 67 శాతం, పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 42 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
స్థూలకాయంగా పరిగణించకపోయినా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న వారిలో మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడి చేస్తోంది.
అయితే స్థూలకాయంతో బాధపడుతూ రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న పురుషులకు మాత్రం వారి వయసులో ఉన్న ఇతర పురుషుల కంటే క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉన్నట్టు గుర్తించారట.
ఆరోగ్యవంతమైన దారుల్లో బరువుతగ్గడం అవసరం. శారీరక శ్రమ పెంచడం, ఆరోగ్యవంతమైన సమతుల ఆహారం మితంగా తీసుకోవడం, తగినంత వ్యాయామం చెయ్యడం, అలవాట్లను మార్చుకోవడం, జీవన శైలిలో మార్పులు తప్పకుండా చేసుకోవడం ద్వారా పెరిగిన బరువును నియంత్రించుకోవచ్చు.
ఎప్పుడైనా చికిత్స కంటే నివారణే మేలు కనుక బరువు పెరగకుండా నివారించుకోవడం ఉత్తమమైన పద్ధతి. అందుకు వారంలో కనీసం 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం తప్పనిసరి. సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తప్పని సరిగా 7 నుంచి 8 గంటల రాత్రి నిద్ర ఉండాలి.
ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాంతక స్థూలకాయానికి దూరంగా ఉండవచ్చు.
Also read: పీతలు ఇప్పుడు తింటున్నాం కానీ ఒకప్పుడు పొలాలకు ఎరువుగా వాడేవారు, ఎందుకో తెలుసా?