వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. నేడు (మే 25) తెలంగాణ హైకోర్టులో నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేయనున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు‌ వెకేషన్ బెంచ్‌ విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసి తీర్పు చెప్పాలని హైకోర్టు‌ను రెండు రోజుల క్రితం ఆదేశించింది. ఆ ప్రకారం నేడు (మే 25) అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది. 


ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా చూడాలని అవినాష్ రెడ్డి కోరగా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. తన తల్లి ప్రస్తుతం కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్నారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాష్ రెడ్డి కోరారు. అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అవినాష్ పిటిషన్‌లో వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ఇంప్లీడ్ అవ్వనున్నారు. అవినాష్‌కి ముందస్తు బెయిల్ ఇస్తే, కేసులో జరిగే పరిణామాలపై కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీత పేర్కొన్నారు. ఇక నేడు ముందస్తు బెయిల్‌ పిటిషన్ పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.


గతంలో జూన్ 5వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు 
 
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై   కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్‌ 5కు వాయిదా వేస్తున్నట్టు ఏప్రిల్ 28న తెలంగాణ హైకోర్టు తెలిపింది.  దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు... అప్పటి వరకు అంటే సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని... వేసవి సెలవుల కోర్టులో విచారణ జరపాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన న్యాయమార్తి... హైకోర్టు సీజేను కలవాలని సూచించారు.తర్వతా  ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జూన్ 5కి వాయిదా పడింది. నిర్ణయం మళ్లీ అప్పుడే వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. అయినా నిర్ణయం ప్రకటించకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని.. సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరపాలని సూచించింది. గురువారం ఈ  పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.


అరెస్ట్ కు సీబీఐకి ఆటంకాలు లేనట్లే ! 
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి తరపు లాయర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో అరెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేనట్లే. నిజానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సీబీఐకి గతంలోనూ ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టుకు సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అయితే, అరెస్టు నుంచి రక్షణ లభించకపోయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. విచారణకు పిలిస్తే,అరెస్ట్ చేస్తారేమోన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వివిధ కారణాలు చూపి హాజరు కావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.