బరువు తగ్గించే సప్లిమెంట్స్ గా ‘డైట్ పిల్స్’ వాడుకలో ఉన్నాయి. ఇవి అధిక బరువును త్వరగా తగ్గిస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి డైట్ మాత్రలు వాడడం వల్ల అవి బరువును తగ్గించడం మాట పక్కన ఉంచితే, శరీరానికి చేసే హాని ఎంతో ఉంది. ఈ డైటరీ సప్లిమెంట్స్ హృదయానాళ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఈ డైట్ పిల్స్‌లో కెఫిన్ , ఎఫెడ్రిన్ లేదా సినెఫ్రిన్ వంటివి ఉంటాయి. ఇవి రక్తపోటు, హృదయస్పందన రేటును పెంచే ఉత్ప్రేరకాలు.ఇవి గుండెపై పని భారాన్ని పెంచుతాయి. ఒత్తిడికి గురిచేస్తాయి. దీనివల్ల గుండె దడ, అరిథ్మియా, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం ఉంది.
డైట్ మాత్రలు శరీరం చేసే సహజ జీవక్రియలకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి జీవక్రియను పెంచుతాయని, ఆకలిని తగ్గిస్తాయని అంటారు. కానీ ఆ ప్రభావాలను ఏ అధ్యయనం కూడా నిర్ధారించడం లేదు. కొన్ని డైట్ మాత్రలు హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. దీనివల్ల మహిళల్లో రుతుక్రమం సమయానికి రాదు. సంతానోత్పత్తి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. కాబట్టి బరువు తగ్గేందుకు డైట్స్ పిల్స్ వాడడం చాలా ప్రమాదకరం అని తెలుసుకోండి.
డైట్ పిల్స్ వాడడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కొన్ని సప్లిమెంట్లలో గ్రీన్ టీ సారం, గార్సినియ కంబోజియా ఉంటుంది. ఇవి అధిక మోతాదులో శరీరంలో చేరితే హేపటోటాక్సిక్‌గా మారవచ్చు. దీనివల్ల పచ్చకామెర్లు, పొత్తి కడుపు నొప్పి, కాలేయ వైఫల్యం వంటి తీవ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ డైట్ మాత్రలు మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ డైట్ మాత్రలు వాడడం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బరువు తగ్గించే సప్లిమెంట్లను వాడే ముందు వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. వైద్యుల సూచన మేరకే వీటిని వాడాలి.
నిజానికి బరువు తగ్గేందుకు ఇలాంటి డైట్ సప్లిమెంట్లను వాడే బదులు సహజంగా బరువు తగ్గడం ఎంతో ఆరోగ్యం. సమతుల ఆహారం తీసుకుంటూ, వ్యాయామం స్థిరంగా చేస్తూ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువ.
Also read: వానాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చెబుతున్న ఈ రసాన్ని వండుకోండి
Also read: గేమింగ్ డిజార్డర్ ఉందా? అయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది జాగ్రత్త