Neem Leaves: వేపలో ఔషధ గుణాలు అధికం. ప్రాచీన కాలం నుంచి వేపను ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇది చర్మ ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. వేపరసం లేదా వేప నూనె, వేప ఆకులు ఇలా ఏ రూపంలో వేపను తీసుకున్నా అది మంచిదే. వేపలో బయో యాక్టివ్ పదార్థం, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికం. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. మొటిమలు వంటి వాటిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వేప ఆకులను పేస్టులా చేసి ముఖానికి మర్థనా చేస్తే ఎంతో మంచిది. ఇవి బ్లాక్ హెడ్స్‌ను, తెల్లని మచ్చలను పోగొడతాయి. మృత కణాలను తొలగిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యకరంగా మారుస్తాయి. వేప ఆకుల్లో విటమిన్ E, మాయిశ్చరైజ్డ్ ట్రైగ్లిజరైడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. వీటిని వాడడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియాలకు లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి మొటిమలు వస్తున్న చోట వేప ఆకుల పేస్టుని రాస్తే ఉపయోగం ఉంటుంది. మొటిమల వల్ల కలిగే చికాకు, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయి.
కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వేప ఆకుల రసం. ఈ రసాన్ని ఒక స్పూన్ తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగవుతుంది. వేపాకులను నమలడం వల్ల వాటిలో ఉండే క్రిమినాశక లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దంతక్షయాన్ని, చిగురువాపుని రాకుండా అడ్డుకుంటాయి. వర్షాకాలంలో జుట్టు సమస్యలు అధికంగా వస్తాయి. వేపలో నింబ్డిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్‌ను అణిచివేస్తుంది. దీనివల్ల దురద, చుండ్రు వంటి జుట్టు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల పై కూడా వేప వ్యతిరేకంగా పనిచేస్తుంది. వేప ఆకులను లేదా వేపల ఆకుల నుంచి తీసిన రసాన్ని, చర్మ ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉపయోగించడం మంచిది.
వేపను ఆంగ్లంలో అజాడిరచ్టా ఇండికా అని పిలుస్తారు. నీమ్, నీంబా అని కూడా పిలుస్తారు. వేప ఆకుల్లో మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు కూడా లభిస్తాయి. ఈ ఆకులను పోహకాహార పవర్ హౌస్‌గా చెప్పుకుంటారు. వేప ఆకులను నమలడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు కూడా సమతుల్యంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపడతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Also read: అధిక బరువుతో బాధపడుతున్నవారు థైరాయిడ్ క్యాన్సర్ బారిన సులువుగా పడతారా?