Chikungunya Virus : వర్షాలు ఇతర కాలుష్య కారణాల వల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చికున్​గున్యా కూడా వ్యాపిస్తుంది. చికున్​గున్యా వైరస్ వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఇది సోకిన ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల విపరీతమైన కీళ్ల నొప్పులు, జ్వరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది రాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కొన్ని ఇంటి నివారణలు, సెల్ఫ్ కేర్ తీసుకుంటే చికున్ గున్యా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. 


2005, 2010 మధ్యకాలంలో చికున్ గున్యా ఇండియాను తెగ భయపెట్టింది. అప్పటి నుంచి దీనికి భయపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే దీని గురించిన ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. చికున్ గున్యా వైరస్ సోకిన దోమ కుట్టిన నాలుగు నుంచి ఎనిమిదిరోజుల్లో ఇది డెవలప్ అవుతుంది. ఒకటి నుంచి రెండువారాల వరకు దీని లక్షణాలు ఇబ్బంది పెడతాయి. 


లక్షణాలివే.. 


అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు నెలలు, సంవత్సరాల వరకు ఉండొచ్చు. జ్వరం ఉన్న సమయంలో తలనొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన అలసట, అనారోగ్యం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. వికారం, వాంతులు ఉంటాయి. పరిస్థితి విషమించే సమయంలో ఇది కాలేయాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. 


హోమ్ రెమిడీలు


ఒకవేళ చికున్ గున్యా వస్తే వైద్యులు ఇచ్చే మందులతో పాటు.. కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవుతూ ఉండాలి. నీరు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రెటెడ్​గా ఉంచుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, మంటను, వేడిని తగ్గించుకోవడానికి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా పండ్లు, జ్యూస్​లు, సూప్​లు తీసుకోవాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్, మిల్లెట్స్ తీసుకుంటే చాలా మంచిది. 


యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉండే పసుపు, అల్లం వంటివాటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. విటమిన్, మినరల్ రిచ్ ఉండే గుమ్మడికాయ గింజలు, బచ్చలికూరలు అలసటను తగ్గిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఫుడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పాలు తీసుకోవడం, ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి అందుతుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. దీనివల్ల కీళ్ల నష్టం కూడా తగ్గుతుంది. 



ఆ ఫుడ్స్ జోలికి పోవద్దు.. 


చికున్ గున్యా అనే కాదు.. ఏ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా కొన్ని ఫుడ్స్​ని అవాయిడ్ చేయాలి. అలాంటి వాటిలో ప్రోసెస్డ్​ ఫుడ్ ఒకటి. స్వీట్స్, అన్​హెల్తీ ఫ్యాట్స్, కలర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ వంటివి తీసుకోకూడదు. ఈ పరిస్థితిని తీవ్రం చేస్తాయి.  రికవరీ లేట్​గా ఉంటుంది. అలాగే హెల్త్ బాగున్నప్పుడు కూడా వీటిని తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. కాఫీ, సోడా వంటి ఎనర్జీ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్, కెఫిన్ ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి. దీనివల్ల పరిస్థితి విషమించవచ్చు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


దోమలు రాకుండా రెప్లికెంట్స్ ఉపయోగించాలి. కాయిల్స్, జెల్స్ కూడా ఉపయోగించవచ్చు. దోమలు కుట్టుకుండా పొడవాటి చేతులున్న దుస్తులు వేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మొక్కలు, నీటి తొట్టిలో దోమలు చేరే అవకాశముంది కాబట్టి వాటిపై శ్రద్ధ వహించాలి. 


Also Read : ప్రసవానికి ముందు తల్లికి చికెన్ గున్యా.. పుట్టిన బేబికి అరుదైన వ్యాధి, కారణం అదేనట