TGEAPCET Bi.P.C. Stream Counselling Schedule: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 19 నుంచి 22 వరకు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి అక్టోబరు 21 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులకు అక్టోబరు 21 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. వీరికి అక్టోబరు 28న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 28 నుంచి 30లోపు సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా అగ్రికల్చర్ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మ్-డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నవంబరు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్..
ఇక సీట్ల భర్తీకి సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కనివారు, కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు నవంబర్ 4న ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి నవంబరు 5న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినవారు నవంబరు 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి నవంబర్ 9న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు నవంబర్ 9 నుంచి 11 లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబరు 11, 12 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి నవంబర్ 12న 'స్పాట్ అడ్మిషన్'కి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: అక్టోబరు 19 నుంచి 22 వరకు.
➥ ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 21 నుంచి 23 వరకు.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబరు 21 నుంచి 25 వరకు.
➥ తొలి విడత సీట్ల కేటాయింపు: అక్టోబరు 28న.
➥ సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబరు 28 నుంచి 30 వరకు
తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: నవంబర్ 4న.
➥ ధ్రువపత్రాల పరిశీలన: నవంబరు 5న.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబరు 5, 6 తేదీల్లో.
➥ తొలి విడత సీట్ల కేటాయింపు: నవంబర్ 9న
➥ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: నవంబర్ 9 నుంచి 11 వరకు
➥ కాలేజీల్లో రిపోర్టింగ్: నవంబరు 11, 12 తేదీల్లో.
➥ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు: నవంబర్ 12న.