Ugadi Special Recipes : ఉగాది సమయంలో ఉగాది పచ్చడితో పాటు.. పలురకాల పిండివంటలు చేసుకుంటారు. ఇవే కాకుండా ఏ పండుగ సమయంలోనైనా నైవేద్యంగా చేసుకోగలిగే ప్రసాదాలు పులిహోర, దద్దోజనం. వీటిని నార్మల్​గా కాకుండా.. టెంపుల్ స్టైల్​లో చేసుకుంటే.. పండుగా వాతావరణం కాస్త రెట్టింపు అవుతుంది. ఈ రెండు రెసిపీలను అన్నంతోనే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కాస్త డిఫరెంట్​గా వండుకోవాలి. మరి వీటిని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


పులిహోరకు కావాల్సిన పదార్థాలు


బియ్యం - 250 గ్రాములు


నూనె - కప్పు


కరివేపాకు - మూడు రెమ్మలు


పచ్చిమిర్చి - 3


పసుపు - 1 స్పూన్


ఉప్పు - రుచికి తగినంత 


చింతపండు - 50 గ్రాములు


ఆవాలు - అర టీస్పూన్


ఇంగువ - అర టీస్పూన్


మెంతులు - టీస్పూన్ 


పల్లీలు - పావు కప్పు


మినపప్పు - 1 టేబుల్ స్పూన్


శనగపప్పు - 1 టేబుల్ స్పూన్ 


ఎండు మిర్చి - 5 


ఆవాల మసాల కోసం


ఆవాలు - 2 టీస్పూన్లు


ఎండుమిర్చి - 1


అల్లం - అంగుళం


ఉప్పు - తగినంత


తయారీ విధానం


ముందుగా చింతపండును వేడినీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే చింతపండు గుజ్జు ఈజీగా వస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని కడిగి.. నీటిని పోసి స్టౌవ్ వెలిగించి దానిపై ఉంచండి. బియ్యం మరీ మెత్తగా కాకుండా ఉడికిపోయినప్పుడు స్టౌవ్ ఆపేసి గంజి వార్చుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పసుపు, కాస్త నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై చిన్న కడాయిని పెట్టండి. దానిలో రెండు స్పూన్ల నూనె వేసి.. ఆవాలు, మెంతులు వేసి వేగనివ్వాలి. అప్పుడే కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు దానిలో చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. మీకు కావాలనుకుంటే ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చు. 


చింతపండు గుజ్జు చిక్కగా అయ్యాక దానిలో.. ఆవాల ముద్ద (ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, ఉప్పును కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.) వేసి ఉడికించాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. పూర్తిగా చల్లారిన తర్వాత అన్నంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మరో చిన్న కడాయిని స్టౌవ్​పై పెట్టి.. దానిలో నూనె వేసి.. ఆవాలు చిటపటలాడనివ్వాలి. దానిలో శనగపప్పు, మినపప్పు, పల్లీ వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసి వేగనిచ్చి స్టౌవ్​ని ఆపేసి.. అన్నంలో వేసి కలపాలి. రెండు సార్లు తాళింపు ఎందుకు వేశామంటే.. చింతపండు ఉడికించేప్పుడు పప్పులు కూడా వేసేస్తే.. అవి క్రంచీగా కాకుండా మెత్తగా అయిపోతాయి. అందుకే విడివిడిగా తాళింపు వేసుకుంటే ప్రసాదం పులిహోర అద్భుతంగా తయారవుతుంది. 


దద్దోజనం ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం..


దద్దోజనం చేసుకోవడానికి అన్నం, ఆవు పెరుగు, ఉప్పు, మిరియాలు, అల్లం, నీరు ఉంటే చాలు. దద్దోజనం వండుకునేప్పుడు బియ్యాన్ని కాస్త ముందుగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత దానిని ఉడికించుకోవాలి. కాస్త మెత్తగా అయ్యేలా అన్నాన్ని ఉడికిస్తే దద్దోజనం బాగా వస్తుంది. ఇలా వండిన అన్నంలో అల్లం ముక్కలు, మిరియాలు, ఉప్పు వేసి కలపాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత దానిలో పెరుగు, కరివేపాకు ఆకులు వేసి కలపాలి. టెంపుల్ స్టైల్​ దద్దోజనం చేసుకునేప్పుడు వీటిలో ఇంకేమి వేయకూడదు. ఇప్పుడు నైవేద్యంగా పెట్టేందుకు పులిహోర, దద్దోజనం రెండూ సిద్ధమై పోయాయి. పూజా తర్వాత ఇంటిల్లిపాదీ హాయిగా లాగించేయవచ్చు. 


Also Read : ఉగాది పచ్చడిని ట్రెడీషనల్​గా ఇలాగే చేయాలి.. మామిడి కాయలను అస్సలు వేయకూడదట