Traditional Ugadi Pachadi Recipe : ఉగాది (Ugadi 2024) రానే వచ్చేసింది. అయితే ఉగాదికి చేసుకునే అత్యంత ముఖ్యమైన వంటకాల్లో ఉగాది పచ్చడి ఒకటి. ఈ పచ్చడి లేకుండా ఏ ఇంట్లో కూడా పండుగ వెళ్లదనే చెప్పాలి. అయితే ఉగాది పచ్చడి చేసే తీరు ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం ఇలా షడ్రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. కానీ రోజులు మారేకొద్ది వాటిలో ఇష్టమైనవన్నీ వేసుకునే వారు కూడా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అసలు సంప్రదాయబద్ధంగా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


చింతపండు 


వేప పూత 


బెల్లం 


మిరియాలు 


రాళ్ల ఉప్పు 


మామిడి పిందెలు 


ఉగాది పచ్చడిని చేసుకునేప్పుడు అన్ని పదార్థాలు ఉజ్జాయింపుగా వేసుకోవాలి. రుచిలో సమానంగా ఉంటాయి అని ఉజ్జాయింపుగా.. దీనిని చేసుకోవచ్చు. కొందరు ఈ పచ్చడిని తాగేలా చేసుకుంటారు. మరికొందరు దీనిని తినేలా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా దీనిలో ఉపయోగించాల్సిన పదార్థాలు ఇవి మాత్రమే. 


తయారీ విధానం


ముందుగా చింతపండులోని గింజలు తీసేసి.. నీళ్లతో కడిగి నానబెట్టుకోవాలి. అనంతరం బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. చేదుకోసం ఉపయోగించే వేపపువ్వును తీసుకుని.. దానిని సున్నితంగా చేతితో నలపాలి. అలా చేస్తే పువ్వు రేకులు విడిపోతాయి. ఇప్పుడు దానిలో కాడలు తీసేసి.. వేప పువ్వు రేకులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఘాటు లేదా కారం కోసం మిరియాలు, సాల్ట్​కి బదులు రాళ్ల ఉప్పు తీసుకుంటే మంచిది. ఈ రెండింటీని కలిపి.. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొందరు ఉగాది పచ్చడిలో కారం వేసేస్తారు కానీ.. అది కరెక్ట్​ కాదని.. మిరయాలే ఉగాది పచ్చడిలో వినియోగించాలి శాస్త్రం చెప్తోంది.


మామిడి కాయలు వేయకూడదు..


ఉగాది పచ్చడిలో అందరూ చేసే అత్యంత పెద్ద మిస్టేక్ ఏంటంటే మామిడి కాయలు వేయడం. అసలు ఉగాది పచ్చడిలో మామిడి కాయలే వేయకూడదట. అలా మామిడి కాయలు వినియోగిస్తే అది పులుపునిస్తుంది. చింతపండును పులుపునకు వినియోగించినప్పుడు మామిడి కాయను ఎలా వేస్తాము. అసలు ఉగాది పచ్చడిలో మామిడి పిందెలు వేస్తారు. ఇది వగరను సూచిస్తుంది. ఇది తెలియక చాలా మంది మామిడి కాయలు వేస్తారు. ఇప్పుడు మామిడి పిందెలు తీసుకుని వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.


నానిపోయిన చింతపండును బాగా కలిపి గుజ్జును.. చింతపండు పల్ప్​ను వేరు చేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును ఓ మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో మామిడి ముక్కలు, బెల్లం తురుము, వేప పువ్వు, మిరియాలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో బెల్లం కరిగిపోతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీనిని మీరు నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంటిల్లిపాది హాయిగా తినవచ్చు. ఇది కేవలం పండుగ కోసమే కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఉగాది పచ్చడిలోని ప్రతి పదార్థం ఒక్కోరుచిని.. మొత్తంగా ఆరు రుచులను ప్రతిబింబిస్తాయి. బెల్లం (తీపి), మామిడి పిందెలు (వగరు), మిరియాలు (ఘాటు లేదా కారం), రాళ్ల ఉప్పు (ఉప్పు), వేప పువ్వు (చేదు), చింతపండు (పులుపు) రుచులను ప్రతిబింబిస్తాయి. దీనిలోని ప్రతి రుచి ఒక్కో ఎమోషన్​ని కలిగి ఉంటుంది. అందుకే కొందరు ఉగాది పచ్చడిలో ఏ రుచి వస్తుందో.. ఆ సంవత్సరమంతా ఆ విధంగానే కొనసాగుతుందని నమ్ముతుంటారు. 


Also Read : ఉగాది స్పెషల్ ఆంధ్రా స్టైల్ బొబ్బట్లు.. ఈ రెసిపీతో టేస్టీగా చేసుకోవచ్చు