Ugadi 2024 Special Bobbatlu Recipe : పండుగల సమయంలో ముఖ్యంగా.. ఉగాది సమయంలో ఎక్కువగా చేసుకునే రెసిపీలలో బొబ్బట్లు ఒకటి. అయితే దీనిని తయారు చేసుకోవడం కాస్త కష్టంతో కూడిన పనే. కానీ మీరు కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే దీనిని హాయిగా ఇంట్లో చేసుకోవచ్చు. పైగా ఇలా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
మైదా - 1 కప్పు
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నీరు - ముప్పావు కప్పు
నెయ్యి - వంటకు సరిపడా
పూర్ణం కోసం..
శనగపప్పు - 1 కప్పు
నీరు - 2.5 కప్పులు
బెల్లం - 1 కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
తయారీ విధానం
ముందుగా గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, మైదా పండి, పసుపు, చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేయాలి. బొబ్బట్లు బాగా రావాలంటే.. ఈ పిండి మిశ్రమాన్ని జల్లెడ పట్టాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా నీరు వేసుకుంటూ.. ముద్దగా కలుపుకోవాలి. పిండిని కలుపుతూ.. ముద్దలు లేకుండా మెత్తని పిండిగా బాగా పిసికి కలుపుకోవాలి. పిండి తేలికగా.. మెత్తగా ఉండేలా కలపుకోవడం కోసం దానిలో నూనె లేదా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. పిండిలో నెయ్యి కలిపోయేలా పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడే పిండి మృదువుగా, తేలికగా మారుతుంది. ఇలా కలుపుకున్న పిండిని.. కవర్ చేసి.. అరగంట పక్కన పెట్టుకోవాలి. కవర్ చేసేముందు ఓ చెంచా నెయ్యి కూడా వేసుకోవచ్చు.
బొబ్బట్లు పూర్ణం కోసం..
కుక్కర్‌ను తీసుకుని దానిలో శనగపప్పు వేసి కడగాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై కుక్కర్ పెట్టి.. శనగపప్పు ఉడికేలా నీరు వేయాలి. కావాలంటే మీరు ఓ గంట ముందు శనగపప్పును నానబెట్టుకోవచ్చు కూడా. దీనిని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. కుక్కర్ మూత తెరిచి.. శనగపప్పు బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికితే పర్లేదు. కానీ.. ఉడకకుంటే మరోసారి కుక్కర్ వెలిగించి.. అవసరాన్ని బట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన శనగపప్పులో నీరు ఎక్కువ ఉంటే కాస్త పారేసి.. కుక్కర్లో పప్పు గుత్తితో శనగపప్పు కచ్చాపచ్చాగా మెత్తగా చేసుకోవాలి. కొందరు చేతివేళ్లతో ఈ ప్రాసెస్ చేస్తారు. అలాంటివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఇలా చేసుకున్న పప్పును కాస్త చల్లారిన తర్వాత మిక్సర్‌లో లేదా గ్రైండర్ జార్లో వేయాలి. దానిలో తరిగిన బెల్లం, యాలకుల పొడి వేసుకోవాలి. ఇవి మంచి పేస్ట్.. కాస్త కచ్చాపచ్చాగా అయినా మిక్స్ అయ్యేలా గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బొబ్బట్లు తింటున్నప్పుడు అక్కడక్కడ శనగపప్పు కూడా తగులుతూ ఉంటుంది. అలా అని ఎక్కువగా పప్పులు ఉండేలా చేయకూడదు. గోధుమ రవ్వ మాదిరిగా ఉంటే చాలు. లేదంటే బొబ్బట్లు విరిగిపోతాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి.. శనగపప్పు, బెల్లం మిశ్రమంలో వేయాలి. మంటను తగ్గించి.. పిండిని మిక్స్ చేస్తూ.. పిండిని బాగా కలపాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి ఎండిపోకుండా కవర్ చేయండి.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని.. శనగపప్పుతో చేసిన బాల్స్ చుట్టూ లేయర్‌గా చుట్టి.. వాటిని మెత్తగా కావాల్సినంత సైజ్‌లో.. బొబ్బట్టు చితికిపోకుండా చేతితో ఒత్తుకోండి. అంచులు పోకుండా.. జాగ్రత్తగా దానిని చదును చేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి తవా పెట్టండి. దానిపై కాస్త గోధుమపిండిని చల్లి.. అది గోధుమరంగులోకి మార్చి తర్వాత పిండిని తుడిచేసి.. బొబ్బట్టును ప్లేస్ చేయాలి. కాస్త నెయ్యి వేసుకుని ఇరువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బొబ్బట్లు రెడీ. హాయిగా వీటిని ఉగాది రోజు చేసుకుని ఆస్వాదించేయండి.
Also Read : క్యారెట్లను ఇలా వండుకుంటే బరువు సులభంగా తగ్గుతారట.. సింపుల్, టేస్టీ రెసిపీలు ఇవే