International Carrot Day 2024 : క్యారెట్స్​లు వివిధ పోషకాలతో నిండి ఉంటాయి. పైగా రుచిగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా.. ఫైబర్, విటమిన్లు, మినరల్స్​తో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని వండుకునే కాకుండా.. నేరుగా కూడా తీసుకుంటారు. క్యారెట్స్ మిమ్మల్ని నిండుగా, శక్తివంతంగా ఉంచుతాయి. అందుకే వీటి ప్రాముఖ్యతను వివిరిస్తూ.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన అంతర్జాతీయ క్యారెట్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 


వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది క్యారెట్లను తమ డైట్​లో చేర్చుకుంటారు. బరువు తగ్గాలనుకునేవారు కూడా క్యారెట్లను తీసుకోవచ్చు. పైగా క్యారెట్లతో చేసుకునే కొన్ని ఫుడ్స్​ కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. క్యారెట్స్ నేరుగా తినడం ఇష్టం లేనివారు టేస్టీ రెసిపీలను తయారు చేసుకోవచ్చు. వీటిని చేయడానికి పెద్దగా కష్టపడాల్సి అవసరం కూడా లేదు. పోషకాలతో కూడిన క్యారెట్ రెసిపీలను ఏవిధంగా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చుద్దాం. 


క్యారెట్ సూప్ 


క్యారెట్ సూప్ హెల్త్​కి చాలా మంచిది. దీనిని ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. క్యారెట్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కోసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై సూప్ పాట్ పెట్టాలి. దానిలో ఆలివ్ నూనె వేసి.. క్యారెట్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లిని వేసి ఉడికించాలి. అవి వేగిన తర్వాత దానిలో వెజిటేబుల్ స్టాక్ వేసుకుని.. ఉడికించాలి. అవి మృదువైన సూప్​ మాదిరిగా తయారయ్యాక.. ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయాలి. ఈ సూప్​లో విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక. 


స్వీట్​గా తినాలనిపిస్తే హల్వా


హల్వా అంటే స్వీట్​ కదా.. ఇది బరువు పెరిగేలా చేస్తుంది.. కానీ తగ్గేలా ఎలా చేస్తుందనే డౌట్​ మీకుందా? అయితే కొన్ని టిప్స్​తో దీనిలో కూడా కేలరీలు తగ్గించుకోవచ్చు. క్యారెట్ తురుమును తీసుకుని.. దానిలోనుంచి జ్యూస్​ తీసుకోవాలి. మందపాటి కడాయిలో ఈ జ్యూస్​ వేసి స్టౌవ్ వెలిగించి.. దానిని ఉడికించాలి. అది సగమయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. తెల్లని చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనె వేసి కలుపుకోవచ్చు. కొంచెం మొత్తంలో నెయ్యిని వేసుకుని బాగా కలపాలి. హల్వానుంచి నెయ్యి విడిపోయేవరకు దానిని ఉడికించాలి. రుచిని పెంచుకునేందుకు నట్స్​ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఈ టేస్టీ హల్వా కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. 


క్యారెట్ సలాడ్


క్రంచీగా తినాలనుకుంటే మీరు క్యారెట్స్​తో సలాడ్స్ చేసుకోవచ్చు. తురిమిన క్యారెట్​లను, తరిగిన దోసకాయ, టమోటాలను, కొత్తిమీరతో గార్నిష్ చేసి మీరు సలాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్. దీనిలో మీరు నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది మంచి రుచిని కలిగి ఉంటుంది. దీనిలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి.. ఎక్కువసేపు ఆకలికాకుండా చేస్తాయి. ఈ సలాడ్ బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది. 


రెగ్యూలర్​గా చేసుకోనే ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము వేసుకుని క్యారెట్ ఇడ్లీలు చేసుకోవచ్చు. స్టీమ్​తో చేసిన ఈ ఫుడ్​ని రెగ్యూలర్​గా తీసుకుంటే హెల్త్​కి చాలామంచిది. అధిక ఫైబర్ కంటెంట్​తో ఉండే ఈ ఫుడ్ బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకేమి ఆలస్యం బరువు తగ్గాలనుకున్నప్పుడు మీ రుచికి తగ్గట్టుగా ఈ రెసిపీలు చేసుకుని హాయిగా లాగించేయండి.


Also Read : కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీలు.. కలిపి తింటే ఉంటాది.. నోరూరించే రెసిపీలు ఇవే







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.