Health Benefits of Sleeping on a Floor : మెత్తదిండు కన్నా ఉత్త చాప మేలు అని ఓ సినిమాలో వేటూరి గారు ఓ ఉద్దేశంతో రాశారో కానీ.. నేలపై చాప వేసుకుని పడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పరుపుపై పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది.. ఈ పరుపు వాడితే మీకు నడుమునొప్పి తగ్గుతుంది అనే ప్రకటనలు కూడా మీరు ఎన్నో విని పరుపులు కొనే ఉంటారు. అవి మీకు కొంతమేరకు హాయినిస్తాయి. అయితే ఈ పరుపులు కన్నా.. నేలపై పడుకుంటే ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నేలపై పడుకోవడం కష్టంగానే ఉన్నా సరే మీ ఆరోగ్యం కోసం కింద పడుకోండి అంటున్నారు నిపుణులు. పూర్వీకులు అంతా నేలపై పడుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉండేవారని చెప్తున్నారు. పరుపులనేవి తర్వాతి కాలంలో మానవ సౌకర్యార్థం వచ్చాయి తప్పా వాటి కంటే నేలపై పడుకోవడంలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మీకు నిద్ర సమస్యలుంటే.. మీ స్లీపింగ్ స్టైల్‌ని మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.
వెన్నునొప్పికి చెక్
మీకు స్ట్రెస్ లేదా ఇతర కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుందా? అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకుంటే మీరు నేలపై పడుకోండి. నిద్ర భంగిమల్లో మార్పుల వల్ల కూడా నడుమునొప్పి వచ్చే అవకాశముంది. అయితే నేల మీద పడుకోవడం వల్ల మీ నిద్ర భంగిమ కరెక్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా.. మీ హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్కు ఉపశమనం లభించి.. మీకు నడుము నొప్పి తగ్గుతుంది.
కరెక్ట్ పోస్టర్
చాలా మంది నిటారుగా కాకుండా.. వంగి కూర్చోంటారు. ఇలాంటి పోస్టర్ మీకు నడుము నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారుతుంది. ఈ సమస్య మీలో ఉంటే నేలపై పడుకోండి. ఇది మీ మెడ, తలను సరైన అమరికలోకి తీసుకువస్తుంది. తద్వార మీ భంగిమ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
మెరుగైన నిద్ర కోసం
పనిలో ఒత్తిడి.. ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిద్ర సమస్య వల్ల చేసే పనిపై శ్రద్ధ పెట్టలేము.. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అయితే మీరు నేలమీద పడుకోవడం వల్ల మీరు మెరుగైన నిద్ర పొందవచ్చు. మొదట్లో ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించినా.. తర్వాతి రోజుల్లో మీరే ఛేంజ్ చూస్తారు.
వేడి తగ్గుతుంది..
చలికాలంలో వేడిగా ఉంటే మంచిదే కానీ.. శరీరంలో వేడి ఎక్కువైతే.. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాతవరణం వేడిగా ఉండడం వేరు.. శరీరంలో వేడి ఉండడం వేరు. ఈ సమస్యలో మీరు పరుపై పడుకుంటే.. దాని నుంచి వచ్చే వేడి కూడా మీకు ఇంకా చిరాకు, ఇబ్బందిని కలిగిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల శరీరం ఉష్ణోగ్రతలు నార్మల్ అవుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. పరుపు మీద పడుకోవడం తప్పేమి కాదు కానీ.. నేలపై పడుకోవడం వల్ల మీరు మరిన్ని లాభాలు పొందవచ్చు.
Also Read : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్‌తో జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.