BRS Leader Rampath Reddy Dies of heart attack: జనగామ: బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి మృతిచెందారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే నేటి సాయంత్రం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంపత్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. హార్ట్ స్ట్రోక్ తో రోహిణి హాస్పిటల్ లో సంపత్ రెడ్డి కన్నుమూశారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.
జనగామ నుంచి బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం కోసం గత కొన్ని రోజులు తీరిక లేకుండా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్వర్ రెడ్డి విజయంలో సంపత్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఓవైపు పార్టీ ఓడిపోవడం, మరోవైపు జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చనిపోవడంతో జనగామ బీఆర్ఎస్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంపత్ రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.
పాగాల సంపత్ రెడ్డి స్వగ్రామం జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంపత్ రెడ్డి చిల్పూర్ మండల జడ్పిటిసి గా ఎన్నికై జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana Ex CM KCR) కు అత్యంత సన్నిహితుడైన పాదాల సంపత్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.