Bhujangasana Benefits : సూర్యనమస్కారాలు రోజూ చేస్తే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా దానిలో ఒక్కో ఆసనం.. వివిధ బెనిఫిట్స్ ఇస్తుంది. అయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భుజంగాసనం గురించి. బ్యాక్ బెండింగ్ ఆసనాన్ని మీరు రోజులో ఎప్పుడైనా సాధన చేయవచ్చు. పైగా చాలా సులభంగా ఈ ఆసనం వేయొచ్చు. ఇది కేవలం శారీరక ప్రయోజనాలు మాత్రమే కాదు.. మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
భుజంగ అంటే సర్పం. ఆసనం అంటే భంగిమ. ఈ ఆసనం పాము పడగ విప్పినట్టు ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అందుకే దీనిని కొందరు కోబ్రా పోజ్ అని కూడా అంటారు. అయితే ఈ ఆసనాన్ని ఎలా చేయాలో? చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఎవరు ఈ ఆసనానికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసనం వేసే విధానం..
ఈ ఆసనం చేయడం చాలా సులభం. ముందుగా నేలపై బోర్లా పడుకుని.. మీ ముఖం క్రిందకి ఉంచి మీ అరచేతులను, భుజాల పక్కన ఉంచండి. ఇప్పుడు మీ కాళ్లను సాగదీస్తూ.. నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇప్పుడు మీ శరీరాన్ని భుజాల సాయంతో పైకి ఎత్తండి. మీ కాళ్లు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోండి. ఈ భంగిమను 30 సెకన్లు పాటు చేసి.. ఆపై విశ్రాంతి తీసుకోండి. ఇలా రోజుకు రెండు మూడు నిమిషాలు.. మీ సామర్థ్యం, సమయాన్ని బట్టి చేస్తూ ఉండొచ్చు.
భుజంగాసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఈ ఆసనం మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మీ కండరాలను మరింత సరళంగా చేస్తుంది. ముఖ్యంగా మీ ఛాతీ, చేతులు, భుజాలు, మెడకు మంచి ఆకృతిని అందిస్తుంది. ఉదరంపై పడే ప్రెజర్.. పొట్టను తగ్గించడంలో సహాయం చేస్తుంది. మెరుగైన జీర్ణవ్యవస్థను అందిస్తుంది. మీ శ్వాసకోశ వ్యవస్థకు చాలా మంచిది. మెరుగైన రక్త ప్రసరణతో పాటు.. మూత్రపిండ వ్యవస్థ మీ సొంతమవుతుంది.
అంతేకాకుండా వెన్నెముకను బలోపేతం చేస్తుంది. పొట్ట తగ్గాలి అనుకునేవారు కచ్చితంగా ఈ ఆసనం ప్రయత్నించి మంచి ఫలితాలు పొందవచ్చు. హృదయ సమస్యలను దూరం చేస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే కచ్చితంగా దీనిని ట్రై చేయండి మెరుగైన మానసిక స్థితి మీ సొంతమవుతుంది. ఉబ్బసం వంటి సమస్యలున్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read : పండుగ సమయంలో ఈ ఫేషియల్స్ మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తాయి
ఎవరు చేయకూడదంటే..
ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆసనాన్ని కొందరు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఈ ఆసనానికి దూరంగా ఉంటే మంచిది. పొత్తికడుపు, వెన్నుకి శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, మెడ సమస్యలున్నవారు ఈ ఆసనం వేసే ముందు వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా ఈ ఆసనం వేసే వారు ఎవరైనా స్ట్రెచ్ చేసే సమయంలో పోజ్ సరిగ్గా రావట్లేదని శరీరాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయకండి. రోజూ దీనిని ప్రాక్టీస్ చేస్తే మీ పోజ్ మెరుగవుతుంది.
Also Read : హెల్తీ, టేస్టీ సగ్గుబియ్యం వడలు.. క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి..