మధుమేహులు, గుండె సంబంధిత రోగులు ఏది తినాలన్నా వెనకాడతారు. ఇష్టమైన ఆహార పదార్థం తినడం వల్ల ఎక్కడ లేని పోనీ కొత్త సమస్యలు వచ్చి పడతాయో అని భయపడతారు. అలాంటి వల్ల కోసం ఎంతో టేస్టీ ఫుడ్ ఈ టోఫు. గ్లూటెన్ రహితంగా, తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇదనులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు కొలెస్ట్రాల్ కూడా ఉండదు. శాఖాహారులకి కీలకమైన ప్రోటీన్స్ అందిస్తుంది. పాలతో పనీర్ చేస్తారనే సంగతి మీకు తెలిసిందే. ఈ టోఫు కూడా పనీర్ ని పోలి ఉంటుంది. అయితే ఇది సోయా మిల్క్ తో తయారు చేస్తారు. వీటితో చేసుకునే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన ఫుడ్ అని చెప్పొచ్చు.


బరువు తగ్గొచ్చు


టోఫు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది మంచి ఎంపిక. ఇందులో మొక్కల నుంచి వచ్చిన వాటితో తయారైన పదార్థం కనుక ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. అధిక ప్రోటీన్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్, కొవ్వు తక్కువ. ఇది తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల అతిగా తినాలనే కోరిక ఉండదు, ఆకలిని అదుపులో ఉంచుతుంది.


ఈస్ట్రోజన్ పెంచుతుంది


మహిళలకి ఎంతో అవసరమైన ఈస్ట్రోజన్ స్థాయిలను ఇది పెంచుతుంది. మోనోపాజ్ సమయంలో మహిళలకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో వచ్చే వేడి ఆవిర్లను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.


కాల్షియం మెండు


టోఫు కాల్షియం అందించే అద్భుతమైన పదార్థం. ఎముకల బలానికి కీలకంగా వ్యవహరిస్తుంది. బోలు ఎముకల వ్యాధి శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల సంభవిస్తుంది. అటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే టోఫు తీసుకోవడం ఉత్తమం. ఇది తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి.


మధుమేహులకి మంచిదే


మధుమేహులు తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఇది సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా అందుతాయి. అంతే కాదు తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ని కలిగి ఉంటుంది.


గుండె జబ్బులని నియంత్రిస్తుంది


టోఫు, సోయా ఉత్పత్తులు ఏవైనా శరీరంలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వుల స్థాయిలని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.


రుచిగా ఉంటుంది కదా అని టోఫుని ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా చెయ్యడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకు 2-3 టోఫులని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తునారు. అప్పుడే అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. టోఫు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందనే అపోహ ఉంది. కానీ అది వాస్తవం కాదు నిజానికి ఇది రొమ్ము క్యాన్సర్ సమస్యని తగ్గిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: వినాయక చవితికి స్నేహితులను ఇలా విష్ చేయండి