''నీ యాటిట్యూడ్ గురించి ఒక్కసారి ఆలోచించు'' అని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు దర్శకుడు రాజ్ మదిరాజు (Raj Madiraju) సలహా ఇచ్చారు. 'లైగర్' (Liger Movie) పరాజయం పాలవడంతో సోషల్ మీడియాలో రౌడీ బాయ్ ప్రవర్తన మీద విమర్శలు వస్తున్నాయి. ముంబై మరాఠా సినిమా ఓనర్ మనోజ్ దేశాయ్ విమర్శలు చేయగా... ఆయన్ను విజయ్ దేవరకొండ కలిశారు.
మనోజ్ దేశాయ్ మాత్రమే కాదు... సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రేక్షకులు ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్స్‌లో విజయ్ దేవరకొండ ప్రవర్తించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో దర్శకుడు రాజ్ మదిరాజు రాసిన లేఖ వైరల్ అవుతోంది. అందులో విజయ్ తీరును ఆయన సుతిమెత్తగా ఎత్తి చూపారు. ''నీ వీరాభిమానిగా అడుగుతున్నాను'' అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
పులిచారలా? వర్మనో, వంగానో చూసి పెట్టుకున్న వాతలా?
''విజయ్ దేవరకొండ... నీ యాటిట్యూడ్ గురించి ఒక్కసారి ఆలోచించు! అది నీ ఒరిజినలా? లేదంటే నీ మొహానికి వేసుకున్న ముసుగా? నీ చర్మం మీద నిజంగా పులిచారలా? లేక వర్మనో, వంగానో చూసి పెట్టుకున్న వాతలా?? కపాలం నుంచి అరికాలు వరకూ శరీరంలోని ప్రతి అణువులోనూ... ఆ మధ్యలో ఉన్న యాభై లక్షల స్వేద రంధ్రాల్లోనూ నిండి ఉన్న వ్యక్తిత్వమా అది? లేక పాడు ప్రపంచాన్నుంచి నిన్ను నువ్వు రక్షించుకునే ప్రయత్నంలో నువ్వు ఆర్డరిచ్చి తయారు చేయించుకున్న డిజైనరు డిఫెన్సు మెకానిజమా?'' అని రాజ్ మదిరాజు ప్రశ్నించారు.
విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి వేరు కాదని నమ్ముతున్నా!
''నువ్వు విజయ్ దేవరకొండవా? లేక అర్జున్ రెడ్డివా? ఇద్దరూ వేరు కాదని నువ్వు నమ్ముతున్నావా?'' అని రాజ్ మదిరాజు మరో ప్రశ్న సాధించారు. విజయ్ దేవరకొండ బిహేవియర్ మీద ఆయన సూటిగా వ్యాఖ్యలు చేశారు. ''నీ సక్సెస్ నీ సినిమాలో క్యారెక్టర్ల వల్ల కాక ఇలా తల తిరుగుడు ధోరణితో వచ్చిందని నమ్మి నిన్ను నువ్వు ట్రెయిన్ చేసుకున్నావా?'' అని రాజ్ మదిరాజు అన్నారు. పరోక్షంగా విజయ్ దేవరకొండ తల తిరుగుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు.
విజయ్ దేవరకొండ ముఖంలో ఆందోళన
'లైగర్' విడుదలైన తర్వాత దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు విజయ్ దేవరకొండ అటెండ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన ముఖంలో ఆందోళన కనిపించిందని రాజ్ మదిరాజు వ్యాఖ్యానించారు. ''షార్జాలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ నీ చుట్టూ వేల మంది అరుస్తున్నా... నీ చేతులు చప్పట్లు కొడుతున్నా... నీ మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. కారణమేంటి? 'లైగర్' బాక్సాఫీసు పెర్ఫార్మెన్సా?పెరిగిపోతున్న ఇండియా కొట్టాల్సిన రన్‌రేటా?'' అని విజయ్ దేవరకొండను రాజ్ మదిరాజు అడిగారు.
విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ రాసుకొచ్చి మాట్లాడుతున్నారా?
ప్రేక్షకులలో కొంత మందిలో ఉన్న సందేహం ఏంటంటే? విజయ్ దేవరకొండ ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చి సినిమా వేడుకల్లో మాట్లాడతారా? - రాజ్ మదిరాజు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో ఈ అంశం గురించి కూడా ప్రస్తావించారు.
''ఫంక్షన్లలో స్టేజి మీద, ఇంటర్వ్యూలలో కెమెరా ముందు నువ్వు చెప్పే మాటలు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడేవా? లేక నిద్రలో లేపి అడిగినా నీ జవాబులు అవేనా?'' అని రాజ్ మదిరాజు అడిగారు. ఒకవేళ అది విజయ్ దేవరకొండ ఒరిజినల్ అయితే మాత్రం దాని మార్చుకోవద్దని చెప్పారు. అంతే కాదు... ''అలాగే అదే పొగరుతో 'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ కాదు' అన్న బలుపుతో 'నన్ను నువ్వు కాదు నేను నిన్ను ఇరుకున పెడతాను, ఇబ్బంది పెడతాను' అన్న తలబిరుసుతో ముందుకెళ్ళిపో'' అని రాజ్ సలహా ఇచ్చారు.
Also Read : బాలీవుడ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది, ‘లైగర్’ నిర్మాత ఛార్మీ భావోద్వేగం
విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల సక్సెస్ రాలేదు!
విజయ్ దేవరకొండ సక్సెస్సూ, ఫెయిల్యూరూ... ఏదీ ఆయన యాటిట్యూడ్ వల్ల వచ్చింది కాదని తాను గట్టిగా నమ్ముతానని రాజ్ మదిరాజ్ అన్నారు. ''ప్రపంచాన్ని పట్టించుకోకు. విజయమో? అపజయమో? రాగానే దాన్ని గుర్తిస్తూ నిబిడాశ్చర్యమో, నిర్దాక్షిణ్యమో పడుతుంది. దాని ముందు వినమ్రంగా ఉండాల్సిన పని లేదు. ఎట్ లీస్ట్ నటించాల్సిన అవసరం లేదు. తెచ్చిపెట్టుకున్న తెంపరితనమైతే గనక వదిలేస్కో. నీ ముందు నువ్వు నటించాల్సిన అవసరం రాకూడదు... ఎప్పటికీ!'' అని రాజ్ మదిరాజు తన లేఖను ముగించారు. అదీ సంగతి!
Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు