Revanth Reddy : సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన... బీజేపీ , టిఆర్ఎస్ లు ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కొందరు నేతలు కాంగ్రెస్ ను విడిచిపోతూ పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధుల కొనుగోలు కోసం టిఆర్ఎస్, బీజేపీ లు కమిటీలు వేశాయని విమర్శించారు. మునుగోడులో నేతల కొనుగోలు పక్రియ జరుగుతుందన్నారు. మునుగోడులో నాయకుల జేబులు నిండాయి తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. డిండి ప్రాజెక్టు ఆలస్యం అవ్వడం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల నల్గొండ జిల్లాకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నష్టం చేశాయని ఆరోపించారు.
సెప్టెంబర్ 1న మునుగోడు ఛార్జ్ షీట్
"సెప్టెంబర్ 1న మునుగోడు ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అదే రోజు ఇంటి ఇంటికి ప్రచారం మొదలుపెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు కాస్త టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా పోయింది. నా పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు కలెక్టరేట్ లు ప్రారంభిస్తే నన్ను ఆహ్వానించలేదు. నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభిస్తే ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆహ్వానించకపోగా హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, చనిపోయిన ఆర్మీ జవాన్ ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా? "- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మోడీకి గులాం
ఇతర రాష్ర్టాలలో టీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం తెలంగాణ ప్రజల సొమ్మును దిల్లీ, పంజాబ్, బిహార్ రాష్ట్రాలకు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మోడల్ అంటే కమీషన్ లు..కాంట్రాక్ట్ లు అని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు, ఆస్తులు విధ్వంసం చేయడమన్నారు. ఇలాంటి మోడల్ తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. సందట్లో సడేమియాలా గులాంనబీ ఆజాద్ మోడీకి గులాంగా మారారన్నారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని, గులాంనబీ అజాద్ కాంగ్రెస్ ను నిందిస్తున్నారన్నారు. రాజ్యసభ రెన్యూవల్ కాలేదని ఆజాద్ పార్టీ వీడారని ఆరోపించారు. గుజరాత్ లో జరిగిన నరమేథం ఆజాద్ మర్చిపోయారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేతిలో ఆజాద్ కీలుబోమ్మలాగా మారారన్నారు.
Also Read : ఘన్‌పూర్‌లో TRS వర్గపోరు: నీ చరిత్ర తీస్తే బయటతిరగలేవు - రాజయ్యకు కడియం స్ట్రాంగ్ కౌంటర్
Also Read : KCR National Politics : "రైతు రాజకీయం" సాధ్యమేనా ? కేసీఆర్ జాతీయ రాజకీయాల " ఈక్వేషన్స్ " వర్కవుట్ అవుతాయా?