స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య - కడియం శ్రీహరి మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిన ఎమ్మెల్యే రాజయ్య, తనపై తీవ్ర విమర్శలు చేసి, వేదికను దుర్వినియోగం చేశారని అన్నారు. ఇటీవల జరిగిన కొన్ని వేదికలపై మాట్లాడుతూ ఒకే పార్టీపై ఉన్న ఒక ఎమ్మెల్సీపై ఇలా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. తాను టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో స్టేషన్ ఘన్‌పూర్ లో 300 మందిని ఎన్ కౌంటర్ చేసినట్లుగా రాజయ్య చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మంగళవారం (ఆగస్టు 30) కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
తన గురించి ఏవైనా అసహనాలు, నియోజకవర్గంలో ఇబ్బందులు ఉంటే పార్టీ అధినేతకు చెప్పుకోవాలి కానీ, బహిరంగ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తిని (కడియం శ్రీహరి), ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రాతినిథ్యం వహించిన వ్యక్తిని పట్టుకొని ఇలాంటి విమర్శలు చేయడం ఏంటని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజయ్య తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలు తనకు గతంలో ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వాడానని, వారు తల వంచుకొనే పని ఎప్పుడూ చేయలేదని చెప్పారు. తాను రాజకీయంగా ప్రత్యేకంగా ఉండడమే కాకుండా, నిజాయతీ పరుడిగా పేరు తెచ్చుకున్నానని అన్నారు. ‘‘రాజయ్య కన్నా ముందు మూడు సార్లు స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యా. దాదాపు 6 సార్లు ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్నా. 2014, 2018 ఎన్నికల్లో రాజయ్య గెలుపు కోసం పని చేశాం. తరచూ స్టేషన్ ఘన్ పూర్ తన అడ్డా అని మాట్లాడడం సరికాదు, ఏ ప్రాంతమూ ఎవరి అడ్డా కాదు. తెలివైన రాజకీయ నాయకులు అలా మాట్లాడరు. కాస్త చూస్తుకొని మాట్లాడాలి. నాలుగుసార్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏం చేశామో ముఖ్యం.’’ అని కడియం శ్రీహరి అన్నారు.
తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు ఇవీ
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు అతనికి గిట్టని వారిని ఎన్‌కౌంటర్లు చేయించారని ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలు చేశారు. ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను చంపించాడని సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడని, నియోజకవర్గానికి తాను పూజారినని అన్నారు. ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని, ఎవరినీ కాలు పెట్టనీయనని అన్నారు.