Family Planning Operation Failed:  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఆగస్టు 25వ తేదీన 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వీరిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ మహిళ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళల ఆరోగ్యం విషమించింది. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా నేడు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ వికటించి సంభవించిన మరణాల సంఖ్య 3కు చేరింది. అయితే లావణ్య ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ పరిధిలోని సీతారాం పేటకు, మౌనిక కొలకులపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బృంగి హాస్పిటల్ లో ఒకరు, ఇబ్రహీంపట్నం లోని టీమ్స్ హాస్పిటల్ లో సుష్మ చనిపోగా, ఒవైసీ లో మరొకరు చనిపోయినట్లు సమాచారం.


నలుగురు నాలుగు ప్రైవేటు ఆస్పత్రుల్లో... 
మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లిలికి చెందిన సుష్మతో పాటు ఇబ్రహీంపట్నం సమీపంలోని సీతారంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లి చెందిన మౌనికలు ఆపరేషన్ చేయుంచుకొని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మమతను బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, సుష్మను ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీతారాంపేటకు చెందిన లావణ్యను హైదరాబాద్ లోని ఓవైసీ ఆస్పత్రిలో చేర్పించగా.. మౌనికను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ మమత ఆదివారం చనిపోగా.. సుష్మ సోమవారం వేకువజామునే ప్రాణాలు కోల్పోయింది. ఒక రోజు వ్యవధిలో ఇద్దరు చనిపోగా.. నేడు మరొకరు చనిపోవడం స్థానికంగా విషాధాన్ని నింపింది. 


వైద్యుల నిర్లక్ష్యమే కారణం.. 
ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళలు చనిపోయారంటూ బాధిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ నియంత్ర ఆపరేషన్ ఫెయిల్ అయి నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరం అన్నారు. చనిపోయిన నలుగురికి ఇద్దరిద్దరు చొప్పున పిల్లలు ఉన్నారు. తల్లులు లేకుండా వారి పిల్లలను ఎలా పెంచాలంటూ మృతురాళ్ల భర్తలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందేళ్లు పిల్లాపాపలతో కలిసి హాయిగా జీవించాలనుకున్న తమకు తీరని శోకాన్ని మిగిల్చిన వైద్యులపై కన్నెర్ర చేస్తూనే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


అండగా నిలుస్తామంటున్న అధికారులు.. 
మహిళల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సంక్షేమశాఖ ఉప సంచాలకులు రవీందర్ నాయక్ వెల్లడించారు. అనుభవజ్ఞులైన వైద్యులే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారని విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. చనిపోయిన నలుగురు మహిళల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రంగారెడ్డి ఆర్డఓ వెంకటాచారి హానీ ఇచ్చారు. మొన్న చనిపోయిన ఇద్దరు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అలాగే రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని, మృతుల పిల్లల చదువులు బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన హామీ ఇచ్చారు. 


ఆపరేషన్ చేస్తున్న అనుభవం లేని డాక్టర్లు
అనుభవం లేని డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారని, దాంతో మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపిస్తూ -వారి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై మృతురాలు సుష్మను  అంబులెన్స్ లోనే  ఉంచి, చిన్నపిల్లలతో కుటుంబీకులు సాగర్ రహదారి పై ఆందోళన చేపట్టారు. డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.