MP Gorantla Madhav Video Issue: వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదే విషయంపై రాష్ట్రపతి కార్యాలయం సైతం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. గోరంట్ల మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నీటీ ఫర్ ఉమెన్ జేఏసీ నేతలు రాష్ట్రపతితో పాటు జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆమె.. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదును పంపించారు. 


ఈనెల 23వ తేదీన మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతి ముర్ముని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. 


అసలేంటీ గోరంట్ల మాధవ్ వ్యవహారం.. 
కొన్ని రోజుల కిందట హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఎంపీ మాధవ్ చొక్కా లేకుండా ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడారని ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. టీడీపీ శ్రేణులు ఆ వీడియోను తెగ వైరల్ చేశారు. దీనిపై రాజకీయం దుమారం రేగడంతో గోరంట్ల మాధవ్ ఆ వీడియోపై వివరణ ఇచ్చారు. తాను జిమ్ లో ఉండగా ఆ వీడియో తీసుకున్నానని, దానిని ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అన్నారు. టీడీపీ నాయకులే కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఎంపీ ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీడీపీ కి చెందిన కొందరు వ్యక్తులు చేసిన కుట్ర అని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. 


అలాగే ఈ వీడియోను అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు విడుదల చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్రుడు.. ఎంపీ గోరంట్లపై పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలు మాధవ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ 50 లక్షల మేర పరువు నష్టం దావా వేశారు.


మహిళా కమిషన్ సీరియస్.. 
వైసీపీ ఎంపీ వీడియో వ్యవహారం, వివాదంపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. విచారణ చేపట్టి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని, తప్పు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. అయితే గోరంట్ల మాధవ్ వీడియోపై అటు ప్రతి పక్షాలు, ఇటు మహిళా సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Student Suicide Attempt: కోనసీమలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, గంటకు పైగా టెన్షన్ టెన్షన్ - చివరికి ఏమైందంటే !