స్కూలుకెళ్లే పిల్లలు రోజులో కనీసం తొమ్మిది గంటలు నిద్రపోవాలి. అంతకన్నా తగ్గితే వారిలో అతి త్వరలోనే మానసిక సమస్యలు, మెదడు ప్రాంతంలో ఉండాల్సిన బూడిద రంగు పదార్థం తగ్గడం, అభిజ్ఞా బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం అధికమని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు కచ్చితంగా రోజుకు తొమ్మిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని చెబుతోంది  ఈ అధ్యయనం. వారు చేసిన పరిశోధనలో రోజుకు తొమ్మిది గంటల కన్నా తక్కువ నిద్రపోతున్న పిల్లల్లో మెదడులో జ్ఞాపకశక్తి, తెలివితేటలకు బాధ్యత వహించే ప్రాంతాల్లో చాలా తేడాలు కనిపించాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించారు. ఈ పరిశోధన పూర్తి వివరాలు లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. పదేళ్ల లోపు పిల్లలకు ఈ అధ్యయనం తొమ్మిది నుంచి 12 గంటల్లోపు నిద్రను సిఫారసు చేసింది. 


అధ్యయనం సాగింది ఇలా...
ఈ అధ్యయనం కోసం 9 నుంచి 10 ఏళ్ల వయసు గల 8,300 మంది పిల్లలను ఎంపిక చేశారు. వారి నుంచి సేకరించిన డేటాను పరిశీలించారు. వారు ఎంత సేపు నిద్రపోతారు? ఏ సమయంలో నిద్రపోతారు? వంటి అంశాలను సేకరించారు. అలాగే వారి మెదడు ఎమ్ఆర్ఐ చిత్రాలను, వైద్య రికార్డులను పరిశీలించారు. దాదాపు రెండేళ్ల పాటూ పరిశోధించారు. వారి పరిశోధనలో పదేళ్ల లోపు పిల్లల్లో నిద్ర తగ్గడం వల్ల మెదడులో చాలా మార్పులు జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న అధ్యయనకర్తలు మాట్లాడుతూ నిద్ర తగ్గడం వల్ల మెదడులో వచ్చిన మార్పులు పిల్లల్లో రెండేళ్ల తరువాత కూడా కనిపిస్తున్నయని, అంటే ఇది దీర్ఘకాలికంగా ప్రభావాన్ని చూపిస్తుందని వివరించారు. 


అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంస్థ పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను తల్లిదండ్రులకు సూచిస్తోంది. నిద్ర అనేది ఎంత ముఖ్యమో పిల్లలకు వివరించాలని చెబుతోంది. పగటిపూట నిద్రపోకుండా పిల్లలను నిరోధించి, రాత్రిపూట నిండుగా తొమ్మిది గంటల పాటూ నిద్రపోయేలా చేయాలని సూచిస్తోంది. అలాగే పిల్లలు టీవీ, ఫోన్ చూసే సమయాన్ని తగ్గించాలని సూచించింది. పగటి పూట శారీరక శ్రమను కూడా పెంచాలని చెబుతోంది. 


Also read: మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందేమో అనుమానించాల్సిందే




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.