ఒకప్పుడు సిగరెట్ అలవాటు ఉన్నవారికే అధికంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు సిగరెట్ తాగే అలవాటు లేని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేస్తోంది. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆగస్టున 1న ‘ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం’. ప్రపంచవ్యాప్తంగా ఈ భయంకర వ్యాధిపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ఉద్దేశం. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ జయించిన వారు కూడా ఈ రోజును సంబరంగా నిర్వహించుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం 2020లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దాదాపు  18 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ రకాలలో ఇది కూడా ఒకటి. 


ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. అది ప్రాథమిక దశలోనే కొన్ని సంకేతాలను, లక్షణాలను చూపిస్తుంది. చాలా మంది ఈ లక్షణాలను సాధారణంగా తీసుకుంటారు. పెద్దగా పట్టించుకోరు. అందుకే ముదిరిపోయాకే ఇవి బయటపడుతున్నాయి. చికిత్స అందించినప్పటికీ ఈ క్యాన్సర్ ప్రాణాలను తీస్తోంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే...


ఆగకుండా దగ్గు
దగ్గు ఆగకుండా వస్తుంది. వారం లేదా అంతకన్నా ఎక్కువ కాలం దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. ఏదో ఒక దగ్గు మందు వేసుకుంటే సరిపెట్టేసుకుంటారు చాలా మంది, కానీ దగ్గు వారం దాటి ఉందంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దగ్గుతో పాటూ శ్లేష్మం, రక్తం కూడా కనిపిస్తే కచ్చితంగా జాగ్రత్తపడాల్సిందే. 


శ్వాసలో ఇబ్బంది
శ్వాస ఆడకపోవడం, తీసుకోవడం ఇబ్బంది కలగడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమే. శ్వాసనాళాలు ఇరుకుగా మారడం వల్ల లేదా, ఊపిరితిత్తుల్లో కణితులు ఏర్పడి, ఆ కణితుల్లోంచి బయటికి వచ్చే ద్రవం ఛాతీపై పేరుకుపోవడం వల్ల కూడా శ్వాస సమస్యలు మొదలవుతాయి. కాబట్టి శ్వాసలో ఇబ్బంది అనిపించినా కూడా తేలికగా తీసుకోవద్దు. 


బరువు తగ్గడం
కొందరు హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. కొన్ని రకాల క్యాన్సర్లు ఎటాక్ చేసినప్పుడు బరువు తగ్గడం అనేది ప్రాథమిక దశలో కనిపించే సంకేతం. దీనికి కారణం క్యాన్సర్ కణాలు మీ శరీర శక్తిని అధికంగా వినియోగించుకుని, అవయవాలకు అందకుండా చేయడం వల్ల ఇలా జరుగుతుంది. 


ఒళ్లు నొప్పులు
ఛాతీ, భుజాలు, వీపు వంటి శరీర భాగాల్లో నొప్పి కలుగుతుంది. అవి జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఒళ్లు నొప్పుల్లా ఉంటాయి. ఆ నొప్పులు కూడా దీర్ఘకాలంగా ఉంటే అనుమానించాల్సిందే. అవి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించినప్పుడు అది వివిధ భాగాల్లో నొప్పికి కారణం అవుతుంది. 


Also read: ఈ పదార్థాలు ఇచ్చిన డేట్ కంటే ముందే ఎక్స్‌పైర్ అవుతాయి , జాగ్రత్త పడండి


Also read: మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం



























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.