పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆయన నిన్న పేపర్ బాయ్ అవతారం ఎత్తారు. ఆదివారం ఉదయాన్నే న్యూస్ పేపర్లు సర్ది, ఇంటింటికి సైకిల్ పై వెళ్లి వెళ్లి న్యూస్ పేపర్లు వేశారు. వైఎస్ఆర్ సీపీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఇలా నిరసన తెలిపారు. టిడ్కో ఇళ్లలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే ఇలా పేపర్ బాయ్‌గా మారి.. పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకుని పేపర్లు వేశారు.


స్థానికులకు టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో టిడ్కో ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. 31వ వార్డులోని నాగరాజుపేట సహా పలు ప్రాంతాల్లో పేపర్ వేసిన అనంతరం రామానాయుడు మాట్లాడుతూ.. ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా దినపత్రికలు వేస్తూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి వారికి తెలియజేస్తానని తెలిపారు. అలాగే, మరో నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతానని ఎమ్మెల్యే వివరించారు.


ఏపీలో అధికార వైసీపీ గడపగడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం పేరుతో ఆ పార్టీ లీడర్లు జనంలోకి వెళ్తున్నారు. తమ పథకాల గురించి చెప్పుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి కౌంటర్ గానే నిమ్మల రామానాయుడు  పేపర్ బాయ్ లా మారి గడపగడపకు వెళుతున్నారని ఆయన అనుచరులు తెలిపారు.