High BP: అధిక రక్తపోటు నిశ్శబ్దంగా శరీరంలో హానికరమైన మార్పులకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు అంటే 140/90 mm Hg కంటే ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటుగా నిర్ణయిస్తారు. ఈ సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతోంది. అధిక రక్తపోటుకు తగిన మందులు వాడకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్ల నుంచి 79 సంవత్సరాల లోపు వయసుగల వారిలో 128 కోట్ల మంది అధిక రక్తపోటును కలిగి ఉన్నారు. అధిక రక్తపోటు పూర్తిస్థాయిలో వచ్చేవరకు దాన్ని గుర్తించకపోవడం వల్ల ఇది హానికరంగా మారుతుంది.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం హైపర్ టెన్షన్‌తో ఉన్న పెద్దల్లో సగం కంటే తక్కువ మంది మాత్రమే ఈ సమస్య ఉన్న సంగతిని గుర్తించి చికిత్స చేయించుకుంటున్నారు. వారిలో 21 శాతం మంది మాత్రమే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటున్నారు, మిగతా వారంతా చాలా ప్రమాదంలో ఉన్నారు.
నిశ్శబ్ధ లక్షణాలు ఇవే...
అధిక రక్తపోటు ఉన్నప్పుడు కనిపించే కొన్ని నిశ్శబ్ద లక్షణాలు ఉన్నాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. అధిక రక్తపోటు వల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. గుండెలయ అసాధారణంగా ఉన్నప్పుడు అది రక్తపోటుకు సంకేతంగా భావించాలి. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
తీవ్రమైన తలనొప్పి రావడం కూడా హైబీపీకి సంకేతమే. ఈ తలనొప్పిని సాధారణ తలనొప్పిగా భావించి తేలిగ్గా తీసుకుంటారు ఎంతోమంది. తలనొప్పి వచ్చి, చెమట పట్టడం, గుండెదడ, ఆందోళనగా అనిపిస్తే అది అధిక రక్తపోటు వల్లనేమో అని అనుమానించాలి.
చెవుల్లో గుసగుసలాడే శబ్దం వినిపిస్తున్న కూడా రక్తపోటు నియంత్రణలో లేదని అర్థం. వైద్యపరంగా దీన్ని ‘టిన్నిటస్’ అంటారు.
తల తిరగడం, మైకం కమ్మడం వంటివి కూడా అధిక రక్తపోటులో భాగమే. అధిక రక్తపోటు ఎక్కువైతే మూర్చ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యక్తి బలహీనంగా మారి ఎక్కువసేపు నిలబడలేరు. నడవలేరు.
గందరగోళంగా అనిపిస్తున్నా కూడా అది అధిక రక్తపోటు సంకేతం గానే భావించాలి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా హైపర్ టెన్షన్ ఉంటే తర్వాత తరాల వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు ఉంటే ఉప్పుతో నిండిన ఆహారాలను తినడం తగ్గించుకోవాలి. ఊరగాయలు, అధిక ప్రాసెస్ చేసిన ఆహారం, క్యాన్డ్ ఫుడ్ తినడం తగ్గించాలి. లేకుండే రక్తపోటు అదుపులో ఉండదు.
Also read: ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేస్తే ఆ సమస్య ఎక్కువవుతుందా?
Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.