సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి (మే 14) ఈ ఘటన జరగ్గా, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో చెక్క సామగ్రి కాలి బూడిద కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంటి యజమానిని శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఆయన ఊళ్లో లేరు.


ఇంట్లో రూ.కోటి నగదు?
అగ్ని ప్రమాదం తర్వాత ఇంట్లోని బెడ్ రూమ్‌లో భారీగా డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనిఖీల్లో రూ.కోటి 64 లక్షల 45 వేల నగదు, బంగారం, వెండి లభ్యమైనట్లు సమాచారం.


ఓ దుకాణంలోనూ అగ్ని ప్రమాదం


సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలోని మనోహర్ థియేటర్ సమీపంలో ఉన్న సెంట్రింగ్ వర్క్ షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సకాలంలో ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సెంట్రింగ్ వర్క్ షాప్ లో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.. ఈ ఘటనలో స్వల్పంగా సెంట్రింగ్ సామాగ్రి కాలిపోగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. ఒక్కసారి గా అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు చుట్టుపక్కల దుకాణదారులు ఆందోళనకు గురయ్యారు.. ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..