Junior panchayat secretaries called off strike: వరంగల్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించినట్లు ప్రకటించారు. తమ ఉద్యోగాలను రెగ్యూలరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) 16 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెను అంత సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల జేపీఎస్ సమ్మె విరమించి విధుల్లో చేరాలని లేకపోయి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.
ఓ వైపు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ గడువు ముగిసినా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులలో చేరలేదు. దీంతో సమ్మె విరమించి తిరిగి విధులలో చేరని వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని సైతం నియమించి పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినా కొందరు కార్యదర్శులు వెనక్కి తగ్గలేదు. శనివారం ఉదయం నుంచి కొందరు జేపీఎస్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు ప్రభుత్వ సిబ్బంది నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ క్రమంలో కొందరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులలో చేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ప్రకటించారు.
విధులలో చేరని వారని ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మే 14 వరకు ఎవరైనా విధులలో చేరని పక్షంలో, ఆ జేపీఎస్ స్థానంలో కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్వులను నియమించుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్ ను పట్టించుకోకపోగా, ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో కొందరు జేపీఎస్ లు శనివారం తిరిగి విధులలో చేరారు. అన్ని జిల్లాల సంఘాల నేతలు జాబ్ లో తిరిగి చేరదామని, ప్రభుత్వాన్ని మరోసారి తమ సమస్యను పరిష్కరించమని కోరదామని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లిని జేపీఎస్ నేతలు కలిశారు. తమ విధులు యథాతథంగా నిర్వర్విస్తామని, అయితే తమకు న్యాయం చేయాలని కోరుతూ.. సమ్మె విరమిస్తున్నట్లు జేపీఎస్ ల రాష్ట్ర సంఘం శనివారం రాత్రి ప్రకటించింది. సీఎం కేసీఆర్ కు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్య వివరించి, సమస్య పరిష్కారం కావడానికి తన వంతు సాయం చేస్తానని మంత్రి ఎర్రబెల్లి వారితో అన్నారు.
చర్చలకు పిలవలేదు - తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఎర్రబెల్లి !
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దని సూచించారు.