పెద్దవాళ్ళ మాదిరిగా కాకుండా చిన్న పిల్లలో గుండె జబ్బులు జీవనశైలిలో మార్పులు వల్ల రావు. దురదృష్టవశాత్తూ కొంతమంది పిల్లలకి పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తాయి. వాటిని వైద్యులు వెంటనే గుర్తించి తగిన చికిత్స చెయ్యాలి. గుండె జబ్బులు నిర్ధారణ అయిన తర్వాత తక్షణమే స్పందించి సకాలంలో చికిత్స ఇవ్వడం వల్ల ఆ బిడ్డ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. మరికొంత మంది పిల్లలకు గుండె జబ్బుకి సంబంధించిన లక్షణాలు త్వరగా బయట పడవు. చిన్నతనంలోనే గుండెకి రంధ్రం పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల్ని చూస్తూనే ఉంటున్నాం. కొంతమంది తల్లిదండ్రులు ఆ విషయం తెలిసినా నిర్లక్ష్యం వల్లో లేదంటే డబ్బు సమస్య వలనో సరైన సమయానికి చికిత్స అందించలేరు. ఫలితంగా వాళ్ళని కోల్పోవాల్సి వస్తుంది. గుండె జబ్బులు ఆలస్యం చేస్తే పిల్లవాడు పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యని ఎదుర్కోవచ్చు.
పిల్లల్లో గుండె జబ్బులు గుర్తించడం ఎలా?
పుట్టే ప్రతి బిడ్డకి గుండెసంబంధిత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. బిడ్డ పుట్టిన తర్వాత శిశు వైద్యుల దగ్గరకి వారిని క్రమం తప్పకుండా తీసుకెళ్తూ పరీక్షలు చేయించాలి. పిల్లల్లో ఏదైనా గుండె జబ్బు ఉన్నట్టు అనుమానం ఉంటే వెంటనే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ దగ్గరకి రిఫర్ చేస్తారు. గుండె లోపాన్ని నిర్ధారించేందుకు వైద్యులు ఎకోకార్డియోగ్రామ్ చేస్తారు. పుట్టుకతో వచ్చేవే ఎక్కువగా ఉంటాయి. క్లిష్టమైన గుండె లోపాల్ని వైద్యులు శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే శస్త్రచికిత్స చేయవచ్చు.
గుండె జబ్బు సంకేతాలు
పిల్లలు సరిగా ఆహారం తీసుకోకపోవడం, తినేటప్పుడు అలిసిపోవడం, బరువు పెరగడం, అతిగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల ప్రమాదానికి సంకేతాలుగా గుర్తించాలి. మరికొంతమంది పిల్లల్లో శిశువు ఎదుస్తున్నప్పుడు పెదవులు, నాలుక, గోర్లు నీలం రంగులోకి మారిపోతాయి. పెద్ద వయసు వచ్చే సరికి న్యుమోనియా, అలసి పోవడం, శ్వాస ఆడకపోవడం వంటివి జరుగుతాయి. పుట్టుకతో గుండె జబ్బులు వచ్చే కేసులు చాలా తక్కువగా ఉంటాయని కార్డియాలజిస్ట్ చెప్పుకొచ్చారు. వెయ్యి మందిలో 8-10 మంది పిల్లలకి మాత్రమే అటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేవలం 1% మాత్రమే పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్నారు.
ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
పిల్లలకి తగిన పోషకాలు అందె విధంగా ఆహారం అందించాలి. వాళ్ళకి స్థిరమైన వ్యాయామం అంటూ ఏది లేదు. రోజుకి కనీసం 1-2 రెండు గంటల పాటు బహిరంగ వాతావరణంలో ఆడుకుంటే సరిపోతుంది. గుండె జబ్బులు ఉన్న పిల్లలు త్వరగా అలిసిపోతారు. వాళ్ళు ఎంత వరకు శ్రమించగలరు అనే దానికి పరిమితి ఉంటుంది. అది వైద్య నిపుణుల సలహా మేరకు పాటించాలి.
ఇక ఆహారం విషయానికి వస్తే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, లీన్ ప్రొటీన్లు, గింజలు, చిక్కుళ్ళు, కూరగాయల ఆధారిత నూనెలతో సహా వివిధ రకాల ఆహారాలు ఇవ్వాలి. డోనట్స్, పంచదార, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహరం, సోడియం ఎక్కువ ఉన్న పదార్థాలు మితంగా తీసుకోవాలి. గుండె జబ్బు ఉన్న పిల్లల జీవక్రియ వేగంగా ఉంటుంది. అందుకే వాళ్ళు కేలరీలను త్వరగా బర్న్ చేసుకోగలుగుతారు. అందువల్ల అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని అందించాలి.
పాలు లేదా పాల ఉత్పత్తులు, మాంసం, పప్పులు, మొలకలు, గింజలు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు చేర్చాలి. పెద్ద పిల్లలకు ఉప్పు, వేయించిన, తీపి, జంక్ ఫుడ్‌లను నివారించడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేపలు, ఆవిశే గింజలు, వాల్ నట్స్, కనోలా, సోయా బీన్స్, ఆకుకూరలు క్రమం తప్పకుండా పెట్టాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు
Also Read: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఈ సమస్యలు అధిగమించవచ్చు