BJP Nabanna Cholo: బంగాల్‌లో మమతా బెనర్జీ పాలనను వ్యతిరేకిస్తూ భాజపా మంగళవారం చేపట్టిన 'చలో సచివాలయం' (నబన్నా చలో) మార్చ్ హింసాత్మకంగా మారింది. కోల్‌కతా సహా పలు ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట సహా ఘర్షణ జరిగింది. అయితే కొంతమంది పోలీసులపై కాషాయ జెండాలు పట్టుకున్న కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులు చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
కర్రలతో చితకబాది
కోల్‌కతాలో ఓ పోలీసును భాజపా జెండాలు పట్టుకున్న ఆందోళనకారులు కర్రలతో చితకబాదారు. ర్యాలీని అడ్డుకొనేందుకు వచ్చిన పోలీసుని నిరసనకారులు చుట్టుముట్టి కర్రలతో ఆయనపై విచక్షణారహితంగా దాడిచేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీసు అక్కడి నుంచి పరుగులు తీసినా ఆందోళనకారులు వదల్లేదు. పోలీసును పరిగెత్తించి దాడి చేశారు. ఇది చూసిన కొందరు స్థానికులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
ఇదేనా గౌరవం
ఇందుకు సంబంధించిన వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అధికార టీఎంసీ ఫైర్ అయింది. ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ భాజపాపై తీవ్ర ఆరోపణలు చేసింది.
అరెస్ట్
భాజపా చేపట్టిన మార్చ్‌ను అడ్డుకోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో భాజపా కార్యకర్తలు మరంత రెచ్చిపోయారు. ఓ పోలీసు వాహనానికి నిప్పంటించారు.
భాజపా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు రైళ్లు, బస్సుల్లో రాజధాని కోల్‌కతాకు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా భాజపా వెనక్కి తగ్గకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు కోల్‌కతాకు రాకుండా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Also Read: Viral Video: ఇదేం సెల్ఫీరా సామీ! ఫొటో తీసుకుని ఫోన్ విసిరేశాడు!
Also Read: Prashant Kishor Meets Bihar CM: నితీశ్ కుమార్‌తో పీకే భేటీ- ఈ ట్విస్ట్ వెనుక అంతరార్థం ఏంటో!