Prashant Kishor Meets Bihar CM: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం సాయంత్రం పట్నాలో సమావేశమయ్యారు. ఈ భేటీ సుమారు రెండు గంటల పాటు సాగినట్లు విశ్వసనీయ వర్గాలు ఏబీపీ న్యూస్‌కి తెలిపాయి. ఇటీవల నితీశ్, కిశోర్ ఒకరిపై ఒకరు పదునైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ఆ వెంటనే మళ్లీ ఇలా సమావేశం కావడంతో చర్చనీయాంశమైంది.
అందుకేనా
2024 లోక్‌సభ ఎన్నికలకు నితీశ్ కుమార్ విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం చేయడానికి జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీశ్ చేసిన ప్రయత్నాన్ని అపహాస్యం చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఇటీవల సెటైర్లు వేశారు.
పీకే సెటైర్లు
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని పీకే అభిప్రాయపడ్డారు. విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడలేమన్నారు. భాజపాను ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, బిహార్ సీఎం నితీశ్ కుమార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇతర విపక్ష నేతలతో ఇటీవల వరుస భేటీలు నిర్వహిస్తున్న వేళ పీకే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫెవికాల్ బాండ్
ఇటీవల స్వాతంత్య్ర వేడుకల్లో నితీశ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించారు. వచ్చే రెండేళ్లలో నీతీశ్ ప్రభుత్వం 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను 'జన్ సురాజ్ అభియాన్' ప్రచారాన్ని ఉపసంహరించుకుంటానన్నారు. నితీశ్ సర్కారుకు మద్దతు ప్రకటిస్తాననన్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర పార్టీలన్నీ ప్రయాసలు పడుతుంటే.. నితీశ్ కుమార్ మాత్రం ఫెవికాల్ వేసుకొని మరీ సీఎం కుర్చీకి అతుక్కుని కూర్చున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read: Goa Political News: కాంగ్రెస్‌కు భారీ షాక్- భాజపాలోకి 8 మంది ఎమ్మెల్యేలు జంప్!
Also Read: Watch: జేసీబీలో ఆసుపత్రికి తరలింపు- వైరల్ వీడియో!