ఆరోగ్యం అంటే కేవలం శారీరకమైనదే కాదు, మానసికమైనది కూడా. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆనందంగా జీవించగలడు. ఈ రెండింటిలో ఏది ఇబ్బంది పడిన ఆ మనిషి జీవితం నరకమే. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటామో, మానసిక ఆరోగ్యాన్ని అంతకుమించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాన్ని దూరంగా పెట్టి, సమతుల ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆహారాలు మానసిక సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. డిప్రెషన్ యాంగ్జయిటీ, కోపం వంటి భాగోద్వేగాలకు కారణం అవుతాయి. అలాంటి ఆహారాలను అందరూ తగ్గించాల్సిన అవసరం ఉంది. 


ప్రాసెస్ చేసిన ఆహారాలు
ఆధునిక జీవనంలో ప్రాసెస్ చేసిన ఆహారాలకు విలువ పెరిగిపోయింది. వాటినే ఎక్కువగా ఇష్టపడుతోంది యువత. చక్కెర, ఉప్పు నిండిన ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అందులో వాడే రసాయనాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారంలో చక్కెర, ఉప్పు, అనారోగ్య కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటివల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. మానసిక కల్లోలానికి దారితీస్తుంది. శరీరంలో చక్కెర ఎక్కువైతే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరంగా పెడితే ఉప్పు, చక్కెర శరీరంలో చేరడం తగ్గుతుంది. ఫాస్ట్ ఫుడ్‌ను కూడా దూరంగా పెట్టాలి. నూడిల్స్, పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. 


కెఫిన్
రోజుకి ఒకటి లేదా రెండు కాఫీల వరకు ఓకే. అంతకుమించి తాగితే మాత్రం శరీరంలో కెఫీన్ ఎక్కువగా పేరుకు పోతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక ఆందోళన, భయము, చిరాకులాంటి భావాలు ఎక్కువగా కలుగుతాయి. నిద్ర సరిగా పట్టదు. దీని కారణంగా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. కెఫీన్ నిద్రను రాకుండా చేసి మనిషిని చురుగ్గా ఉంచేలా చేస్తుంది. అందుకే ఉదయం పూట మాత్రమే కాఫీని తాగమని చెబుతారు. అంతేకాదు కెఫీన్... మానసిక స్థితిని నియంత్రించే కీలకమైన విటమిన్లను శోషించుకునే శక్తిని తగ్గిస్తుంది. కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల్లో కెఫీన్ అధికంగానే ఉంటుంది. కాబట్టి వీటిని తాగడం తగ్గించాలి. 


ఆల్కహాల్ 
మద్యపానం ఎన్నో రకాల రోగాలకి కారణం. అందులో మానసిక రోగాలూ ఉన్నాయి. ఆల్కహాల్ అధికంగా తాగే వారిలో డిప్రెషన్ వంటివి వస్తాయి.  వీరికి నిద్ర సరిగా పట్టదు. దీనివల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. ఆల్కహాల్ తాగాక ఏమీ తినకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. బి విటమిన్లు శరీరంలో లోపిస్తాయి. వీటన్నిటి వల్ల మనుషులు ఉద్రేకంగా మారిపోతారు. 


అధిక కొవ్వులు ఉండే పదార్థాలు 
సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. వీటిలో గుండెకు హాని చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆందోళనను పెంచుతాయి. మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. నూనెలో బాగా వేయించిన పదార్థాలలో అధికంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. 


గ్లూటెన్
గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్.  ఇది గోధుమలు, బార్లీ వంటి వాటిలో అధికంగా ఉంటాయి. అయితే ఇది కొందరికి పడదు. వారు గ్లూటెన్ రహిత ఆహారాన్ని మాత్రమే తినాలి. అయితే ఏ సమస్య లేని వారు కూడా  గ్లూటెన్ ఆహారాన్ని తక్కువగా తినడమే మంచిది. ఎందుకంటే మానసిక ఆరోగ్యానికి గ్లూటూన్ మంచిది కాదు. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు గ్లూటెన్‌తో ముడిపడి ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తులు గ్లూటెన్ ఆహారాన్ని తక్కువగా తినాలి. 


పైన చెప్పిన ఆహారాలన్నీ మానసిక ఆరోగ్య సమస్యలను నేరుగా కలిగించకపోవచ్చు. కానీ అవి మానసిక సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వీటివల్ల శరీరంలో రసాయనాలు, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి సమతులాహారం తీసుకోవాలి. 


Also read: పూర్వం పిప్పి పన్నును ఇలా సహజంగానే తొలగించేవారు


























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.