భానుప్రియ.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని నటీమణి. చారడేసి కళ్లు, అందమైన నవ్వు, మనోహరమైన డ్యాన్సుకు పెట్టింది పేరు. నటనలో నవరసాలను ఇట్టే ఒలికించే ప్రతిభ ఆమె సొంతం. చిరంజీవి డ్యాన్స్ స్కిల్స్ కు సరితూగే అరుదైన హీరోయిన్లలో తనూ ఒకరు. రెండు దశాబ్దాల పాటు అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగింది. నాటి అగ్ర హీరోలు అందరితోనూ కలిసి నటించింది. భానుప్రియను చూస్తే అచ్చం పక్కింటి అమ్మాయిని చూసినట్లుగానే అనిపిస్తుంది. తన చక్కటి అందం, అభినయంతో ఎంతో మంది సినీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది.


సీనియర్ నటి భానుప్రియకు మెమరీలాస్


తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  కొంత కాలం క్రితం సినిమాలకు విరామం ప్రకటించింది. అయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తను సినిమాలకు దూరంగా ఉంటుంది. కారణం, తన భర్త చనిపోయాక మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నది. కనీసం సినిమాలు చేసే సమయంలో డైలాగులు కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదట.


మెమరీలాస్ సమస్యలకు చికిత్స తీసుకుంటున్నా- భానుప్రియ


తాజాగా ఓ డిజిటల్ ఛానెల్ కు భానుప్రియ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన కెరీర్ తో పాటు ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో పడిన ఇబ్బందులను వివరించింది. తన భర్త మొదలుకొని కూతురు వరకు చాలా విషయాలను పంచుకుంది. “నా భర్త చనిపోయిన తర్వాత మెమరీ లాస్ సమస్య మొదలయ్యింది. డ్యాన్స్ విషయంలోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాను. కనీసం హస్త ముద్రలు కూడా గుర్తు ఉండటం లేదు. కొద్ది కాలం క్రితం ఓ తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ మధ్యలో డైలాగులు పూర్తిగా మర్చిపోయాను. ఒక్కసారి షాక్ కు గురయ్యాను. ప్రస్తుతం ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నిజానికి, నేను ఓ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేయాలి అనుకున్నాను. కానీ, ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న సమస్యలతో ఆ ఆలోచన పక్కన పెట్టేశాను. ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు వైద్యం తీసుకుంటున్నాను” అని భానుప్రియ చెప్పుకొచ్చింది.


ఆదర్శ్ తో మనస్పర్ధలు అవాస్తవం- భానుప్రియ


 ప్రస్తుతం తన కూతురు లండన్ లో చదువుకుంటుందని భానుప్రియ చెప్పింది. తనకు సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. నటనా రంగం వైపు రావాలనే ఆలోచన కూడా తనకు లేదని చెప్పింది. చదువు అయ్యాక తన కెరీర్ ను తనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకుంటుందని చెప్పుకొచ్చింది. భానుప్రియ 1998లో ఆదర్శ్ కౌశల్ అనే ఫొటో గ్రాఫర్‌ను పెళ్లి చేసుకుంది. అతడు 2018లో గుండెపోటుతో చనిపోయాడు. అయితే, ఆయన మరణానికి ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ఊహాగానాలు వచ్చాయి. కానీ, అవన్నీ అవాస్తవాలేనని తాజాగా భానుప్రియ వెల్లడించింది. తమ మధ్య ఎప్పుడూ ఎలాంటి మనస్పర్దలు రాలేదని చెప్పుకొచ్చింది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తాము ఒకరినొకరం కలుస్తుండేవాళ్లమని చెప్పింది. 


Read Also: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?