తల్లిగా మారడం వరం. కొంతమంది బిడ్డ పుట్టాక తల్లి పాలు ఇచ్చేందుకు ఇష్టపడరు. మరికొంతమంది రెండు మూడు నెలలకే తల్లి పాలు మానిపించేసి డబ్బా పాలకు అలవాటు చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వవచ్చు. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ ఎన్నో ప్రయోజనాలు పొందుతుంది. అలాగే తల్లికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత నీళ్లు, ఇతర ఆహారాలు కూడా పెట్టడం మొదలు పెట్టొచ్చు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి మొదటిసారిగా వచ్చే పాలని తాగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలను కొలస్ట్రెమ్ అంటారు. బిడ్డల డైజెస్టివ్ ట్రాక్ అభివృద్ధి చెందడానికి ఇది చాలా సాయం చేస్తుంది. అలాగే వైరస్‌లతో, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని ఇస్తుంది.
ఈ కొలెస్ట్రమ్ పాలలో యాంటీ బాడీలు పుష్కలంగా ఉంటాయి. బిడ్డ ముక్కు, గొంతు, జీర్ణశక్తి మీద ఒక రక్షణ పొరని ఏర్పరుస్తుంది. ఆ పొర బిడ్డ ఏ జబ్బు బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకే ప్రసవం తరువాత వచ్చే మొదటి పాలని పిల్లలకు తాగించమని సూచిస్తారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు పూర్తిగా తాగిన పిల్లలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. తల్లిపాలు తాగిన పిల్లలు చాలా తెలివిగా ఉంటారు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే తల్లితో బిడ్డకు అనుబంధం కూడా చాలా పెరుగుతుంది. ఇది వారి మధ్య ప్రేమ, అనుబంధానికి పునాది లాంటిది.
ఈ రోగాలన్నీ దూరం...
తల్లిపాలు తాగడం వల్ల కేవలం బిడ్డకు మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి అనుకోకండి. తల్లికి కూడా ఎంతో మేలు. బిడ్డకి పాలిచ్చే తల్లులు త్వరగా బరువు తగ్గుతారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. అలాగే బిడ్డను మోసిన గర్భసంచి కూడా మళ్లీ సాధారణ పరిస్థితిలోకి మారిపోతుంది. బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకు ప్రసవం అయ్యాక రక్తస్రావం కూడా తక్కువగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది స్త్రీలు ప్రసవానంతరం పోస్టుమార్టం డిప్రెషన్ లోకి వెళ్తారు. అయితే బిడ్డకి పాలిచ్చే తల్లులు ఆ డిప్రెషన్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హైబీపీ, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, రక్తంలో కొవ్వు చేరకపోవడం వంటి సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.బిడ్డకు పాలిస్తున్నప్పుడు మళ్లీ పీరియడ్స్ ఆలస్యంగా మొదలవుతాయి. కాబట్టి మీ బేబీ తో ఎక్కువ సమయం సంతోషంగా గడపవచ్చు. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల తల్లికి బిడ్డకి మేలు జరుగుతుంది.
Also read: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మీకు థైరాయిడ్ వచ్చిందేమో చెక్ కోవాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.