ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, స్క్రీన్ రైటర్, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తన పెళ్లికి సంబధించిన ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించారు. తన భార్య సుశీల చరక్ (ప్రస్తుతం సల్మా ఖాన్ అని పిలుస్తారు) కుటుంబం మొదట్లో తమ వివాహానికి అభ్యంతరం చెప్పిందన్నారు. అమ్మాయిది హిందూ మతం కావడంతో, ముస్లీం అబ్బాయి అయిన తనకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదన్నారు. అంతేకాదు, పెళ్లి సందర్భంగా సల్మాన్ తల్లి ఫ్యామిలీ తనతో ఎలా ప్రవర్తించిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
మతాంతర వివాహానికి ఒప్పుకోని సుశీల తండ్రి
సలీంఖాన్ కొడుకు అర్బాజ్ ‘ది ఇన్విన్సిబుల్స్’ అనే టాక్ షో నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటరాక్షన్ సమయంలో, సలీం ఖాన్ మతం కారణంగా తన భార్య సుశీల(ప్రస్తుతం సల్మా ఖాన్) కుటుంబం లేవనెత్తిన అభ్యంతరాల గురించి వివరించారు. “సుశీలా చరక్, ఇప్పుడు సల్మా ఖాన్ అని పిలుస్తున్నాం. తను సంపన్న మహారాష్ట్ర హిందూ కుటుంబంలో పెరిగింది. ఇద్దరం ప్రేమలో పడ్డాం. నాతో మతాంతర వివాహానికి ఆమె కుటుంబం వ్యతిరేకించింది. రహస్యంగా ఆమెను కలవడం నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే, ఆమె తల్లిదండ్రులను కలిసి పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నాను. ఈ విషయాన్ని సుశీల వాళ్ల ఇంట్లో చెప్పింది. నేను వారి పెద్దలను కలవడానికి వెళ్లాను. అప్పుడు, దేశంలోని మహారాష్ట్రీయులందరూ ఒకే చోట సమావేశమైనట్లు అనిపించింది. చాలా మంది ఉన్నారు. వారిని చూసి కాస్త భయం అనిపించింది. అందరూ నన్ను చూడటానికి వచ్చారు. జంతు ప్రదర్శనశాలలో కొత్త జంతువును చూసినట్లు చూస్తున్నారు. మా మామగారు నాతో మాట్లాడారు. మీ గురించి విచారించాం. మీరు చదువుకున్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చారు. మీ అంత మంచి అబ్బాయి మరొకరు ఉండకపోవచ్చు. కానీ, మీ మతం మాకు ఆమోదయోగ్యం కాదు” అని చెప్పారన్నారు.
పెళ్లి కోసం శంకర్ గా పేరు మార్చుకున్న సలీం ఖాన్
చివరకు ఈ పెళ్లి కోసం తన తండ్రి సలీం ఖాన్ అనే పేరును శంకర్ గా మార్చుకున్నారని అర్బాజ్ ఖాన్ తెలిపారు. ఆ తర్వాత తన తల్లి సుశీలను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. సలీం శంకర్ గా మారి మహారాష్ట్ర హిందూ కుటుంబానికి అల్లుడిగా మారారని చెప్పుకొచ్చారు. సలీం ఖాన్ ప్రేమకు తన అమ్మమ్మ ఎప్పుడూ సపోర్టుగా ఉండేదట. ఆమె తనను శంకర్ అనే పిలిచేదని చెప్పుకొచ్చారు సలీం ఖాన్. తమది మతాంతర వివాహం అయినప్పటికీ ఏనాడు ఇరు కుటుంబాల్లో చిన్న మనస్పర్థలు కూడా రాలేదన్నారు. ఇప్పటి వరకు అందరూ కలిసి మెలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. మతాలు వేరైనా మనుషులుగా ప్రేమతో కలిసి జీవిస్తున్నట్లు సలీం వెల్లడించారు.
Read Also: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!