బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిబ్రవరి 6న మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదికగా వీరి వివాహం జరగబోతోంది. ఇందుకోసం సూర్యగఢ్ ఫైవ్ స్టార్ హోటల్‌ అందంగా ముస్తాబైంది. ఇవాళ్టి(శనివారం) నుంచే పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి హాజరయ్యే బంధు మిత్రులకు నూతన పెళ్లి జంట ఓ కీలక విజ్ఞప్తి చేసిందట. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని కోరిందట. హోటల్ సిబ్బందికి కూడా ఇదే విషయాన్ని చెప్పిందట. తమ అభ్యర్థనను దయచేసి పాటించాలని కోరిందట. గతంలో విక్కీ, కత్రినా సైతం తమ పెళ్లి సందర్భంగా బంధుమిత్రులకు ఇలాంటి విజ్ఞప్తి చేశారు.   


హల్దీ, సంగీత్ వేడుకలు షురూ


ఇవాళ, రేపు( ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో) సిద్దార్ధ్, కియారా హల్దీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. మరుసటి రోజు(ఫిబ్రవరి 6న) స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుంది. ఇప్పటికే హల్దీ వేడుకలు మొదలయ్యాయి. జైసల్మేర్ వేదికగా జరుగుతున్న ఈ వివాహ వేడుకకు సిద్, కియారా కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారట. వీరిలో కొంత మంది దర్శకులు, నిర్మాతలు, సినీ నటీనటులు ఉన్నారట. కరణ్ జోహార్, అశ్విని యార్డి, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని, షాహిద్ కపూర్ దంపతులు ఈ పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ వెళ్లనున్నట్లు  సమాచారం.  


ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్


పెళ్లి వేడుక జైసల్మేర్ లో జరగనుండగా,  ముంబైలో తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం సిద్ధార్థ్, కియారా గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయట.


తెలుగు ప్రేక్షకులకు కియారా సుపరిచితం


కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. అనంతరం బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని అక్కడే సెటిల్ అయ్యింది. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా కలసి ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు.   










Read Also: ‘పఠాన్‘ స్టోరీ విని షారుఖ్ ఏమన్నారంటే? అస్సలు ఊహించలేదన్న దర్శకుడు సిద్ధార్థ్!