Somu Veerraju On Janasena : మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ పై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, అందుకే ఆర్థిక క్రమశిక్షణను అమలు చేస్తున్నామన్నారు.  అభివృద్ధి, మౌలిక అవసరాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పెంచుకుంటూ వస్తున్నామన్నారు. దేశంలో మత్య్స సంపద పెంచుతున్నామన్నారు. ఏపీ నుంచి 40 శాతం మత్స్యసంపద వస్తుందని గుర్తుచేశారు. సేంద్రియ వ్యవసాయంపై ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. డిజిటలైజేషన్ లో ప్రపంచంలో భారత్ ముందు స్థానంలో ఉందని సోము వీర్రాజు అన్నారు. డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధించామన్నారు. రూ.10 లక్షల కోట్లు మౌలిక పెట్టుబడులు, వివిధ వర్గాల కోసం బడ్జెట్ లో కేటాయించారమన్నారు.  మానవ వనరులపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. యువ శక్తిని ఆర్థిక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ అబివృద్ధి, పాడి సంపద పెంపునకు కేటాయించారని తెలిపారు. 






" టూరిజం అబివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. టూరిజం అబివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. 10 నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం న్యాయం చేసింది. రైల్వే స్టేషన్లకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. "- సోము వీర్రాజు 


జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు 


జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మా, బొరుసు అన్నారు. అవి కుటుంబ పార్టీలన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడానికి కారణం కుటుంబ పార్టీలే అని సోము వీర్రాజు విమర్శించారు. జనసేన కుటుంబ పార్టీ కానే కాదన్న సోము వీర్రాజు..జనంతోపొత్తు లేకపోతే జనసేనతో పొత్తు అన్న మాటకు వివరణ ఇచ్చారు. జనంతో బీజేపీ పొత్తు అనే మాట చాలా బలమైందన్నారు. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో అర్థం ఉందన్నారు. జనంతోనే పొత్తు.. వస్తే జనసేనతో పొత్తు అంటూ స్పష్టం చేశారు. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో బీజేపీ పొత్తు ఉండదన్నారు. బీజేపీ రోడ్లు వేస్తే జగన్ అరగ్గొట్టారన్నారు.  ఇప్పుడు యువ నాయకుడు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సోము వీర్రాజు అన్నారు. త్వరలోనే పాదయాత్రలు చేస్తామన్నారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ కూడా అదే పనిచేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు అదే చేస్తున్నారన్నారు.