CM Yogi Adityanath:
సెక్యులర్ దేశమే: యోగి
హిందువులు, మైనార్టీ అంశంపై మరోసారి కామెంట్స్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మైనార్టీలు సురక్షితంగా జీవిస్తున్న దేశమేదైనా ఉందంటే అది భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇండియా సెక్యులర్ దేశంగానే ఉందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
"హిందువులు మెజార్టీగా ఉన్నప్పటికీ భారత్ సెక్యులర్ దేశం అన్న సంగతి మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరి భద్రతకూ ఇక్కడ భరోసా ఉంటుంది. వసుధైవ కుటుంబం అన్న హిందూ ధర్మం మన జీవనశైలిలో భాగమైపోయింది"
- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
మైనార్టీలపై దాడి..
ఇదే సమయంలో పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌లోని మైనార్టీల దుస్థితి గురించీ ప్రస్తావించారు. చాలా దేశాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో పరిశీలించాలని సూచించారు యోగి ఆదిత్యనాథ్. మైనార్టీలపైనా అక్కడ దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లలో మైనార్టీల ఆధ్యాత్మిక క్షేత్రాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు అనవసరమైన కామెంట్స్ చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. అంతకు ముందు మత మార్పిడిపైనా మాట్లాడారు యోగి. బలవంతంగా, అనైతికంగా మత మార్పిడి చేయాలనుకునే వాళ్లు ఆ పని మానుకోవాలని హెచ్చరించారు. అందరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని సూచించారు. సనాతన ధర్మం ఆచరిచండాన్ని అందరూ గర్వంగా భావించాలని, హిందూ ధర్మం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైందని మానవత్వమే దానికి మూలాలు అని చెప్పారు. రోజురోజుకీ దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందని వెల్లడించారు.
యోగి బెస్ట్ సీఎం: సర్వే
దేశంలో 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్..? అని ఓ సర్వే చేపట్టగా...ఇందులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తన పని తీరుతో, సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన...ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. సీఓటర్, ఇండియా టుడే చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది కంట్రీ పేరుతో చేసిన ఈ సర్వేలో బెస్ట్ సీఎం ఎవరు అని ప్రశ్నించగా...ఎక్కువ మంది యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పారట. సర్వే ప్రకారం మొత్తం 39.1% మంది ప్రజలు బెస్ట్ సీఎం క్యాటగిరీలో "యోగి ఆదిత్య నాథ్"కే ఓటు వేశారు. యోగి తరవాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 16% మంది కేజ్రీవాల్‌కు ఓటు వేశారు. ఇక మూడో బెస్ట్ సీఎంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.3% మంది ఓటు వేశారు. యోగి పాపులారిటీ బాగా పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇదే సమయంలో గతేడాది ఆగస్టుతో పోల్చి చూస్తే...కేజ్రీవాల్ పాపులారిటీ 6% మేర తగ్గింది. గతేడాది ఆగస్టులో కేజ్రీవాల్‌ను బెస్ట్ సీఎంగా 22% మంది తేల్చి చెప్పారు. ఇక మమతా బెనర్జీ పాపులారిటీ కూడా 1% తగ్గింది. మొత్తం 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్ అని లక్షా 40 వేల మందిని సర్వే చేయగా...ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో 2024 ఎన్నికల గురించీ ప్రశ్నించగా...ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వంఅధికారంలోకి వస్తుందని ప్రశ్నించగా...మెజార్టీ ప్రజలు NDA ప్రభుత్వానికే ఓటు వేశారు.