Kapurthala Bhadas village


వెరైటీ నిర్ణయాలు..


హరియాణా, పంజాబ్‌లలోని గ్రామ పంచాయతీలు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమవుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అలాంటి వార్తే ఒకటి వెలుగులోకి వచ్చింది. కపుర్తలా జిల్లాలోని భదాస్ గ్రామంలో పంచాయతీ ఇచ్చిన తీర్పు వైరల్ అవుతోంది. అక్కడి గ్రామ పంచాయతీ ఓ డిక్రీ జారీ చేసింది. దీని ప్రకారం...పెళ్లి తంతులో హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు వేసే సమయంలో వధువులు లెహంగా ధరించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. రాత్రి 12 దాటాక పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఇలాంటి తంతులు నిర్వహిస్తే రూ.11 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే వివాహం జరగాలని, ఎక్కువ మందిని పిలిచేందుకూ అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ రూల్స్‌ను అతిక్రమించేందుకు వీల్లేదని కచ్చితంగా చెప్పింది. ఇంతకీ ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుందంటే... ఖర్చులు తగ్గించుకోడానికి. అవును. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి వేడుకలకు భారీగా ఖర్చు చేయడం సరి కాదని వెల్లడించింది. అందుకే సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని గ్రామస్థుకు సూచిస్తోంది. అనవసరమైన వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి అప్పులపాలు కావద్దని చెబుతోంది. 


ఇదో వింత స్టోరీ..


యూపీలో ఓ వధువు ఉన్నట్టుండి పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. వరుడిపై కోపంతో వేదిక దిగి వెళ్లిపోయింది. పైగా పోలీసులకు ఫోన్ చేసి కేసు కూడా పెట్టింది. ఇంతకీ...వధువు అంతగా కోపగించుకోడానికి కారణం..వరుడు చేసిన ఓ చిలిపి పని. 300 మంది అతిథుల ముందు స్టేజ్‌పైనే వధువుకి ముద్దు పెట్టాడు వరుడు. దీన్ని అవమానంగా భావించిన యువతి వెంటనే వేదిక దిగి కోపంగా వెళ్లిపోయింది. పోలీసులకు ఫోన్ చేసి ఇదంతా చెప్పింది. ఆ తరవాత తేలిందేంటంటే...వధువుకి కోపం వచ్చింది వరుడు ముద్దు పెట్టినందుకు కాదు. అలా వేదికపైనే అందరూ చూస్తుండగానే ముద్దు పెడతానని వరుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో బెట్ కాశాడట. దీనిపైనే ఆగ్రహించిన వధువు "అబ్బాయి క్యారెక్టర్‌ నాకు నచ్చలేదు" అని తేల్చి చెప్పింది. ఇది కాస్తా...పెళ్లి రద్దు చేసుకునేంత వరకూ వెళ్లింది. ఆ తరవాత పోలీసులు కల్యాణ మంటపానికి వచ్చారు. ఇరు వర్గాలనూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.తనను ముద్దు పెట్టుకోవడమే కాకుండా, అసభ్యంగా తాకాడని వధువు ఆరోపించింది. "తను నాకు ముద్దు పెట్టగానే చాలా అవమానంగా అనిపించింది. నా ఆత్మగౌరవం గురించి తను ఏ మాత్రం పట్టించుకోలేదు. అంత మంది ముందు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు" అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువు తల్లి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా...అది వర్కౌట్ అవలేదు. "ఫ్రెండ్స్ చెప్పినందు వల్లే వరుడు అలా ప్రవర్తించాడు. మా కూతుర్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాం. కానీ...మా మాట వినడం లేదు. కొద్ది రోజులు ఆగి ఆ తరవాత ఆమె నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని చూస్తున్నాం" వధువు తల్లి వెల్లడించారు. పెళ్లి రద్దు కాకుండా పోలీసులు ప్రయత్నించినా... ఫలితం లేకుండా పోయింది.


Also Read: Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు