TS Assembly KTR Vs MIM :   తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఇన్నేళ్లుగా జరుగుతుంటే ప్రజలకు ఏం చెప్పాలి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ మెట్రో ఏమైంది ? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని.. అసెంబ్లీ జరిగితే  సభా నాయకుడు కనిపించడం లేదని ఆయన అన్నారు. 


అక్బర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ 


అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నాలుగున్నరేళ్ళలో కేవలం 64 రోజుల పాటు మాత్రమే సభ జరిగిందని ఆరోపించారు. ఇంత తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు జరగడం చరిత్రలోనే మొదటిసారని వాదించారు. అందుకే బీఏసీకి రాలేదని, కలవాలంటే మంత్రులు కూడా అసలు అందుబాటులో ఉండరని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని కేటీఆర్ అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్న ఆయన... సభా నాయకుడు బీఏసీకి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం తగదని చెప్పారు. 


విమర్శలు చేస్తే సహనం తగ్గుతోందని అక్బర్ విమర్శలు 


సభా నాయకుడితో అక్బరుద్దీన్‌కు ఏం పని అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీఏసీకి వెళ్ళారని, అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని తెలిపారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం కూడా భావ్యం కాదని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్ ను మరచిపోయారని విమర్శించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే అక్బరుద్దీన్ కూడా స్పందించారు.  తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అక్బర్ కే సహనం తగ్గి, కోపం వస్తోందని కామెంట్స్ చేశారు.


12వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలు


 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 5, 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 6న ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుంది. 9 నుంచి పద్దులపై చర్చ కొనసాగనుంది. 12న బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.                                                    


లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ఉద్దేశం లేదు - నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్న పోలీసులు!