Adani Group - RSS: గౌతమ్‌ అదానీ గ్రూప్‌పై వస్తున్న వార్తలు దేశీ, విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి భారత పార్లమెంటు వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) ఇచ్చిన రిపోర్ట్‌ మీద చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ స్టోరీలోకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఎంటరైంది, అదానీ గ్రూప్‌కు మద్దతుగా నిలిచింది.


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ మౌత్‌ పీస్‌ అయిన మీడియా విభాగం 'ఆర్గనైజర్' (ORGANISER), డీకోడింగ్‌ ది హిట్ జాబ్ బై హిండెన్‌బర్గ్‌ ఎగైన్‌స్డ్‌ అదానీ గ్రూప్‌ (Decoding the hit job by Hindenburg against Adani Group) అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. అదానీ గ్రూప్‌నకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల తెర వెనుక ఉన్న కథను, RSS తరపున ఈ కథనంలో 'ఆర్గనైజర్‌' వివరించింది. 


అదానీ గ్రూప్‌పై దాడి జనవరి 25, 2023న ప్రారంభం కాలేదని ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ గ్రూప్‌ కంపెనీలను లక్ష్యంగా చేసుకునే స్క్రిప్ట్ ఏడు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో రూపొందిందని 'ఆర్గనైజర్' ఆరోపించింది. 


అదానీ గ్రూప్‌పై ప్రస్తుతం జరుగుతున్న దాడి 2016-17 సంవత్సరంలో ఆస్ట్రేలియా నుంచి ప్రారంభమైందని తన కథనంలో 'ఆర్గనైజర్' పేర్కొంది. గౌతమ్ అదానీ (Gautam Adani) పరువు, ప్రతిష్టను దెబ్బకొట్టడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఒక NGO ఒక వెబ్‌సైట్‌ నడిపిందని వెల్లడించింది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక కూడా ఒక పక్కా ప్లాన్‌ ప్రకారం తయారైందని తన కథనంలో ఆర్గనైజర్‌ తెలిపింది. ఆస్ట్రేలియాలో క్రియేట్ చేసిన వెబ్‌సైట్, అదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడం, గౌతమ్ అదానీని టార్గెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుందట. Adaniwatch.org పేరుతో ఆ వెబ్‌సైట్ నడిచిందట. ఇప్పుడు, ఆ వెబ్‌సైట్‌ ఏర్పాటు ఉద్దేశ్యాలు నెరవేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్గనైజర్‌ పేర్కొంది.


అదానీకి జరిగిన నష్టం ఎంత?
భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న అదానీ గ్రూప్‌ మీద అమెరికన్ షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పాతాళానికి పడిపోయాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ స్టాక్స్‌ విలువ 100 బిలియన్లకు పైగా క్షీణించింది, దాదాపు సగం ఆవిరైంది. ఈ పతనం, గౌతమ్‌ అదానీని ప్రపంచ సంపన్నుల జాబితాలోని 3 స్థానం నుంచి అతి దూరంగా నెట్టేసింది. ప్రస్తుతం, సంపన్నుల జాబితాలో 22వ స్థానంలో గౌతమ్‌ అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ అదానీ గ్రూప్ షేర్లలో పతనం, గౌతమ్ అదానీ నికర విలువ క్షీణత ఆగలేదు. 


అదానీ గ్రూప్‌నకు మరో బిగ్‌ హిట్‌
తాజాగా, ప్రపంచంలోని అతి పెద్ద రేటింగ్ ఏజెన్సీ అయిన S&P (స్టాండర్డ్ అండ్ పూర్), అదానీ గ్రూప్‌లోని రెండు కంపెనీలు - అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ ఔట్‌లుక్‌ను స్టేబుల్‌ నుంచి నెగెటివ్‌ స్థాయికి తగ్గించింది. ఈ వార్త సోమవారం అదానీ గ్రూప్ షేర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. 'abp దేశం' ఎవరికీ వత్తాసు పలకడం లేదు, ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదని పాఠకులు గమనించాలి. అంతేకాదు, మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' సిఫార్సు చేయడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.