అధిక శాతం మంది ఇబ్బంది పడే దంత సమస్య పిప్పి పన్ను. పిప్పి పన్ను రాగానే దాన్ని తొలగించుకునేందుకు వైద్యుల చుట్టూ తిరుగుతారు కొంతమంది. వైద్యులు ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండానే దాన్ని తొలగిస్తారు. కొంతమంది మాత్రం మత్తు మందు ఇచ్చి దాన్ని తొలగిస్తారు. ఇప్పుడంటే మత్తుమందులు, ఆధునికంగా తొలగించే పద్ధతులు వచ్చాయి కానీ, ఒకప్పుడు అలాంటివేవీ లేవు. పూర్వం కూడా ఈ పిప్పి పన్ను సమస్య ఉండేది. దాన్ని సహజంగానే ఊడి పడిపోయేలా చేసే వారట మన పూర్వీకులు. అది కూడా చాలా సింపుల్ పద్ధతిలో.
పిప్పి పన్నులాగితే విపరీతమైన బాధ వస్తుంది. ఆ బాధను తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. పూర్వం ఈ పన్నుతో బాధపడే వారికి పెద్ద వాళ్ళు చెప్పిన చిట్కా ఇంగువ. ఇంగువను చిన్న చిన్న పొడిగా చేసి, ఆ పొడిని పిప్పి పన్ను ఉన్న గుంత లోపలికి వెళ్లినట్టు చేయాలి. అలా రోజూ రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ఐదు నుండి పది రోజులు ఇంగువను పిప్పి పన్ను ఉన్న గుంతలోనే ఉంచడం వల్ల... ఆ పన్ను చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. దాన్ని ప్రత్యేకంగా తొలగించాల్సిన అవసరం లేకుండా, పన్ను దానికదే రాలిపోతుంది. నొప్పి కూడా ఎక్కువగా ఉండదు. పూర్వం పెద్దలు పాటించిన పద్ధతి ఇదే. ఇప్పుడు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది. కానీ ఆధునిక పద్ధతులు, వైద్య విధానాలు రావడంతో దీన్ని పాటించేవారు లేరనే చెప్పాలి. వైద్యుల వద్దకు వెళ్లి బలవంతంగా పన్నును క్లీన్ చేసుకునే వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. కానీ ఈ ఇంగువ పద్ధతిలో చేయడం వల్ల పక్కన ఉన్న దంతాలకు, నరాలకు ఎలాంటి సమస్య ఉండదు. అదే పన్నును బలవంతంగా లాగితే అక్కడ ఉన్న చిన్న చిన్న నరాలు, ఇతర దంతాల పై ప్రభావం పడే అవకాశం ఉంది.
మనం తినే ఆహారంలో ఉండే చక్కెరలు దంతాలపై చాలావరకు పేరుకు పోతాయి. అలా నెలల కొద్ది పేరుకుపోవడం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆ బ్యాక్టీరియా పంటి మీద ఉన్న ఎనామిల్‌ను తొలగిస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి క్యాల్షియం, ఫాస్పేట్ అవసరం. ఇవి ఎనామిల్‌లోనే ఉంటాయి. ఈ ఎనామిల్‌ను బ్యాక్టిరియా తొలగించి పంటి లోపలికి చొచ్చుకొని పోతుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి, బాధ వస్తాయి. ఆ ప్రాంతంలో వాపు కూడా వస్తుంది. పిప్పి పన్ను ఉన్న వ్యక్తి... దేనిమీద ఏకాగ్రత పెట్టలేడు. ఆ నొప్పితో విలవిలలాడి పోతారు. ఏదీ తినలేరు కూడా. అందుకే ఈ సమస్య చిన్నగా కనిపిస్తున్నా, పడే బాధ మాత్రం ఎక్కువే. అలా వదిలేస్తే ఆ బాక్టీరియా పక్కనున్న దంతాలకు కూడా సోకే అవకాశం ఉంది. అందుకే పిప్పి పన్ను వచ్చాక దాన్ని అలా వదిలేయకుండా ఎక్కువమంది తీయించేసుకుంటారు. ఆధునిక వైద్యంలో నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్ మందులను సూచిస్తున్నారు వైద్యులు.
దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కెర ఉన్న పదార్థాలను తగ్గించాలి. అలాగే తిన్న తర్వాత నోరు బాగా పుక్కిలించాలి. నోట్లో ఆహార అవశేషాలు ఏవి లేకుండా చూసుకోవాలి. అన్నిటికన్నా మంచి పద్ధతి... రాత్రి ఆహారం తిన్న తర్వాత, పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం. దీనివల్ల పిప్పి పళ్ళు వచ్చే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
Also read: రోజులో ఒక పావుగంట వెనక్కి నడిస్తే ఈ సమస్యలన్నీ దూరం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.