రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. మానసికంగా కూడా రోజంతా చురుగ్గా ఉండేలా చూస్తుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు ముందుకు మాత్రమే నడుస్తారు అంతా. కానీ రోజులో పావుగంటసేపు వెనక్కి నడవడం వల్ల అంటే బ్యాక్ వాకింగ్ చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వెనక్కి వాకింగ్ చేయడం ఏంటి అని అనుకోవద్దు, ముందుకు వేసే అడుగులనే వెనక్కి వేయాలి. ఈ బ్యాక్ వాకింగ్ అనేది ఇంట్లోనే చేసుకుంటే మంచిది. రోడ్డుమీద వెనక్కి నడవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. పార్కుల్లో బ్యాక్ వాకింగ్ చేయడం కష్టమే. వెనకనుంచి వచ్చే మనుషుల్ని గుద్దేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే ఓ పావుగంటసేపు బ్యాక్ వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రెండు మూడు సార్లు జాగింగ్ చేసిన దాంతో సమానం. 


ముందుకి నడవడం కన్నా వెనక్కి నడవడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగిపోతాయి. దీనివల్ల కొవ్వు కరుగుతుంది కాబట్టి అధిక బరువు తగ్గడం సులువుగా మారుతుంది. వెనక్కి నడవడం కాస్త కష్టమే కానీ, ఇలా నడవడం వల్ల శరీరం బ్యాలెన్స్ ను మరింతగా పొందుతుంది. స్థిరంగా కూడా ఉంటుంది. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల మీలో జాగ్రత్త, అప్రమత్తత పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎప్పుడూ ముందుకు నడుస్తుండడం వల్ల కీళ్లు, కండరాలు దానికే అలవాటు పడతాయి. కానీ వెనక్కి నడవడం వల్ల వాటిలో కాస్త మార్పులు వచ్చి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముందుకి నడవడం కన్నా, వెనక్కి నడవడం వల్ల శక్తి 40 శాతం అధికంగా ఖర్చవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అధికంగా అందుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. 


ఆస్టియో ఆర్థరైటిస్, కాలి కండరాల నొప్పులు, మడమల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవాళ్లు, వెనక్కి నడవడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీర్ఘకాలికంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారికి కూడా వెనక్కి నడవడం వల్ల కాస్త మేలు జరుగుతుంది. మొదట పెట్టినప్పుడు వెనక్కి నడవడం కష్టంగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులు నడిచాక ఆ వ్యాయామం చేయడం సులభంగా మారిపోతుంది.  కాబట్టి మొదటిరోజు కష్టంగా అనిపించిందని చేయడం మానేయవద్దు. మొదటి రోజు అయిదు నిమిషాల పాటూ నడవడంతో మొదలుపెట్టండి. 


Also read: పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లికి ఎంత ఆరోగ్యమో - ఆ రోగాలన్నీ దూరం
























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.